క్యాన్సర్ పేషెంట్స్ పరేషాన్.. 'సెంట్రల్' హాస్పిటల్స్‌లో లేని స్పెషల్ యూనిట్స్!

రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పలు ఆస్పత్రులు వైద్య సేవలందిస్తున్నాయి.

Update: 2023-02-16 23:45 GMT

అవి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పెద్దాస్పత్రులు.. అయితే అధికారుల తీరుతో అక్కడ సరైన సేవలు అందడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ కోసం స్పెషల్ యూనిట్లు లేకపోవడం పేషెంట్స్‌కు ఇబ్బందికరంగా మారింది. వైద్యం కోసం ఈ ఆస్పత్రులకు వచ్చిన వారిని నిమ్స్, ఇతర కార్పొరేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. దీంతో డబ్బులు చెల్లించి చికిత్స పొందాల్సి వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా.. ఇప్పటికీ పరిష్కరించడం లేదని సెంట్రల్ ఎంప్లాయీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పలు ఆస్పత్రులు వైద్య సేవలందిస్తున్నాయి. ఇందులో కార్మికశాఖకు సంబంధించిన సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ హాస్పిటల్, రైల్వేశాఖ పరిధిలోని లాలాగూడ రైల్వే సెంట్రల్‌ ఆస్పత్రి, కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌ ముఖ్యమైనవి. ఈ ఆస్పత్రుల్లో క్యాన్సర్‌కు సంబంధించి ప్రత్యేక విభాగాలు ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. దీంతో క్యాన్సర్ అనుమానంతో, చికిత్స కోసం వస్తున్న వారిని నిమ్స్ తోపాటు ఇతర కార్పొరేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మందికి పైగా ఈఎస్‌ఐ లబ్ధిదారులున్నారు. వీరితో పాటు ఇతర రాష్ట్రాల రోగులు కూడా సనత్‌నగర్‌ ఈఎస్‌ఐకే రిఫరల్ విధానంలో వస్తున్నారు. అయితే క్యాన్సర్‌ బారిన పడి వచ్చే రోగులకు ఆధునాతన చికిత్సల కోసం నిమ్స్‌ కు రెఫర్‌ చేస్తున్నారు. రైల్వే హాస్పిటల్, బీబీనగర్ ఎయిమ్స్ లోనూ ఇలాంటి పరిస్థితే ఉన్నది. అయితే ఇప్పటికే చేసిన చికిత్సలకు ఈఎస్‌ఐ సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో నగదు రహిత చికిత్స చేసేందుకు నిమ్స్‌, ఇతర కార్పొరేట్ హాస్పిటల్స్ నిరాకరిస్తున్నాయి. దీంతో చాలా మంది రోగులు డబ్బులు చెల్లించి మరీ టెస్టులు చేయించుకొని చికిత్స పొందుతున్నారు.

అన్నీ ఉన్నా..

ఈఎస్ఐ సనత్ నగర్‌లో క్యాన్సర్‌ విభాగం ఏర్పాటు చేసుకునే అన్ని సదుపాయాలు ఉన్నాయి. స్థలం, కోట్లాది రూపాయల నిధులు, ఆంకాలజీ విభాగం ఏర్పాటు చేస్తే వన్‌ టైం గ్రాంట్‌ కింద కేంద్రం ఒకే సారి రూ.130 కోట్లు ఇచ్చే నిబంధన ఉన్నప్పటికీ.. దాని ఏర్పాటుకు అధికారులు కృషి చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో క్యాన్సర్వ్యాధి చికిత్సలకు వచ్చే పేషెంట్లకు తిప్పలు తప్పడం లేదు. గత పదేండ్లలో క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య 25 శాతం పెరిగిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రోగులకు అవసరమైన సౌకర్యాలు, చికిత్సకు కావాల్సిన వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలేమీ తీసుకోకపోవడం బాధాకరమని కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ నేషనల్ వైస్ చైర్మన్ వీ కృష్ణ మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదంటే భవిష్యత్ కార్యచరణకు ఉద్యోగులు సిద్ధం కావాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

విద్యార్థులకూ నష్టమే...

బీబీనగర్‌ ఎయిమ్స్‌, రైల్వే, ఈఎస్ఐ ఆస్పత్రుల్లో క్యాన్సర్‌ విభాగం లేకపోవడంతో రోగులకే కాకుండా సంబంధిత కోర్సుల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకూ నష్టం జరుగుతున్నది. వైద్య విద్యలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ దశలో క్యాన్సర్‌ ఒక ఆప్షనల్‌ గా మాత్రమే ఉండటంతో ఎయిమ్స్‌ లో ఈ విభాగం ఏర్పాటుపై ఆసక్తి చూపించటం లేదు. అయితే భవిష్యత్తులో ఆంకాలజీ (క్యాన్సర్‌) విభాగంలో పీజీ సీట్లు రావాలంటే ఈ విభాగం తప్పనిసరిగా ఉండాలని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

హెచ్‌ పీవీ వ్యాక్సినేషన్‌ ఏది?

గర్భాశయ క్యాన్సర్‌ సమస్య మహిళలను పట్టి పీడిస్తున్నది. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్ష మంది మహిళలు కొత్తగా దీని బారిన పడుతుండగా, దాదాపు 60 వేల మంది ప్రాణాలొదులుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. వైద్యపరిశోధనల ఫలితంగా కొన్ని రోగాలకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. హ్యూమన్‌ పాపిల్లొ వైరస్‌ వల్ల వచ్చే ఈ క్యాన్సర్‌ను నివారించే వ్యాక్సిన్‌ ఉన్నది. 12 ఏండ్లు దాటిన యువతులు, మహిళలు ఈ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ప్రయివేటులో రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు ఖర్చవుతుండటంతో పేద మహిళలు వ్యాక్సినేషన్‌ కు నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పేద యువతులు, మహిళలను ఆదుకునేందుకు ఆయా ఆస్పత్రుల్లో హెచ్‌ పీవీ వ్యాక్సినేషన్‌ ను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉన్నది. ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ ను గుర్తించేలా ప్రభుత్వం వైద్య విధానాన్ని మెరుగు పరిచితే ప్రజలకు, ప్రభుత్వాలకు ఎంతో ఖర్చు తగ్గుతుంది.

ప్రతిపాదనలు పంపాలి = కృష్ణ మోహన్, కేంద్ర ప్రభుత్వ గజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్

క్యాన్సర్‌ విభాగాల ఏర్పాటు కోసం అన్ని ఆస్పత్రుల హెడ్స్‌ వెంటనే ప్రతిపాదనలు పంపించాలి. దీంతో రోగులకు ఆధునిక చికిత్స అందడమే కాకుండా, వైద్య విద్యార్థులకు పీజీ సీట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ మూడు ఆస్పత్రుల్లో ఇప్పటికీ ముఖ్యమైన విభాగాలు లేవు. వెంటనే ఏర్పాటు చేయాలి. క్యాన్సర్ పేషెంట్లను కార్పొరేట్ కు పంపించి ఖర్చు చేస్తున్న బడ్జెట్‌తో మన ఆస్పత్రుల్లోనే కొత్త క్యాన్సర్ విభాగాలను ఏర్పాటు చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే ఎంతో మందికి మేలు జరుగుతుంది.

Tags:    

Similar News