High Court : బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ల అమలుపై ‘ప్రత్యేక డెడికేటెడ్‌ కమిషన్‌’ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

Update: 2024-10-30 09:41 GMT

దిశ, తెలంగాణ/ డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ల అమలుపై ‘ప్రత్యేక డెడికేటెడ్‌ కమిషన్‌’ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ వర్గాలకు కల్పించాల్సిన రిజర్వేషన్‌ల శాతంను నిర్ణయించడానికి వీలుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం డాక్టర్‌ కె.కృష్ణమూర్తి కేసులో, త్రిసభ్య ధర్మాసనం వికాస్‌ కిషన్‌రావు గవాలి కేసులో వెలువరించిన ఆదేశాలను పాటించి రాష్ట్రంలో కూడా ప్రత్యేక డెడికేటెడ్‌ కమిషన్‌ను నియమించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ మేరకు బుధవారం హైకోర్టులో జరిగిన వాదనల అనంతరం జస్టిస్‌ ఎస్‌.నంద ఏకసభ్య ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి జస్టిస్‌ ఎస్‌.నంద ఏకసభ్య ధర్మాసనం ముందు సీనియర్‌ అడ్వకేట్‌, మాజీ అడ్వకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ పిటీషనర్‌ పక్షాన వాదనలను వినిపించారు. అనంతరం జస్టిస్‌ ఎస్‌.నంద, ఏకసభ్య ధర్మాసనం పిటీషనర్‌ ఆర్‌.కృష్ణయ్య ప్రజాప్రయోజన వ్యాజ్యంలో లేవనెత్తిన అంశాలను సమర్థించింది.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బీసీ కమిషన్‌కు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్‌ల శాతంను నిర్ణయించేందుకు ప్రత్యేకంగా బాధ్యతలను అప్పగించింది. దీనిపై బీసీలకు రాజకీయ రిజర్వేషన్‌లలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు వీలుగా హైకోర్టులో సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ వేశారు. ఆర్‌.కృష్ణయ్య వ్యాజ్యాన్ని ఏకసభ్య ధర్మాసనం పరిశీలించి వాదనలు విన్నది. రిజర్వేషన్లపై అధ్యయాన్ని బీసీ కమిషన్‌కు అప్పజెప్పడం సరికాదని హైకోర్టు తెలిపింది.

బీసీ కమిషన్‌కు అప్పగించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దమని హైకోర్టు పేర్కొన్నది. ఈ క్రమంలోనే వెంటనే చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం రాష్ట్రప్రభుత్వంను ‘డెడికేటెడ్‌ కమిషన్‌’ను నియమించాలని ఆదేశించడంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య హర్షం ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికైనా హైకోర్టు తీర్పును గౌరవించి వెంటనే నిపుణులతో కూడిన ‘డెడికేటెడ్‌ కమిషన్‌’ను నియమించాలని ఆయన కోరారు.

Tags:    

Similar News