ఆవిర్భావ వేడుకలకు సోనియా.. ఏఐసీసీ నుంచి గాంధీభవన్‌కు క్లారిటీ
ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరు కానున్నట్లు తెలిసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరు కానున్నట్లు తెలిసింది. ఆమె రాకపై ఏఐసీసీ నుంచి గాంధీభవన్‌కు స్పష్టత వచ్చినట్లు తెలిసింది. జూన్ 2న పరేడ్ గ్రౌండ్‌లో జరిగే వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు. సోనియాతో పాటు రాహుల్ గాంధీ రానున్నారనే ప్రచారం జరుగుతున్నది. అయితే సోనియా రాకపై ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎలాంటి ఆఫీషియల్ ప్రకటన విడుదల చేయకపోయినా, పార్టీ నేతలు మాత్రం సోనియాకు ఆహ్వానం పలికేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్ పోర్టు నుంచి పరేడ్ గ్రౌండ్ వరకు సోనియా, రాహుల్‌కు భారీ స్వాగతం పలుకుతూ సభకు చేర్చాలని పార్టీ ప్లాన్ చేసింది.
సభ ఎంట్రన్స్ నుంచి తెలంగాణ సంస్కృతి, కళలు ఉట్టిపడేలా వివిధ కళాకారుల బృందాలు తమ నృత్యాలను ప్రదర్శించనున్నాయి. గ్రౌండ్ వెల్ కమ్‌తో అగ్రనేతలను సభా వేదికకు చేర్చనున్నారు. ఇందుకోసం పార్టీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో కొన్ని టీమ్‌లు కసరత్తు చేస్తున్నాయి. ‘తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లికి వందనాలు’ అంటూ ఎయిర్ పోర్ట్ నుంచి సభ ప్రాంగణం వరకు, పరేడ్ గ్రౌండ్ నుంచి పార్టీ ఆఫీస్ వరకు భారీ స్థాయిలో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలకు ప్లాన్ చేస్తున్నారు. పార్టీ ప్లానింగ్ విభాగం అన్ని ఏర్పాట్లను ప్రిపేర్ చేస్తున్నది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలపై నేతలతో పాటు పబ్లిక్ లోనూ ఆసక్తి నెలకొన్నది.
స్పెషల్ స్పీచ్...?
సోనియా గాంధీ స్పీచ్‌పైనే అందరికీ ఆసక్తి నెలకొన్నది. పార్టీ నేతలతో పాటు ప్రజలూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే పరేడ్ గ్రౌండ్ ప్రధాన స్టేజీపై సోనియా గాంధీకి ప్రత్యేక సన్మానాలకు ప్లాన్ చేశారు. తెలంగాణ ప్రజలు తరఫున థాంక్స్ చెప్పనున్నారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత పదేళ్ల పాటు ఇతర పార్టీ పవర్‌లో ఉండటంతో, సోనియా గాంధీకి ప్రత్యేకంగా సత్కారం చేయలేదనేది కాంగ్రెస్ పార్టీ వాదన. దీంతో తామే పవర్‌లో ఉన్నామని, తెలంగాణ ఇచ్చిన తల్లిని గౌరవించుకుంటామని చెప్తున్నారు. ఇక ఆమె కోసం స్పెషల్ స్పీచ్ తయారు చేస్తున్నట్లు తెలిసింది. 2004 కరీంనగర్ బహిరంగ సభలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఇచ్చిన ప్రామిస్ దగ్గర్నుంచి కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి వచ్చిన డిసెంబరు 2023 వరకు జరిగిన కొన్ని కీలక అంశాలను ఆమె స్పీచ్ కాపీలో ఉంచనున్నట్లు తెలిసింది. ఇక పవర్‌లోకి వచ్చిన ఆరు నెలల పరిపాలనపై కూడా సోనియా తన అభిప్రాయాన్ని వెల్లడించనున్నట్లు పార్టీ ప్రొటోకాల్ విభాగం చెప్తున్నది.
ఆరోగ్యం దృష్ట్యా...?
గడిచిన ఏడాది నుంచి సోనియా గాంధీ పర్యటనలు దాదాపు బంద్ అయ్యాయి. అత్యవసరమైతేనే తప్పా పార్టీ మీటింగ్‌లకు హాజరుకావడం లేదు. ఒక వేళ హాజరైనా... ఆయా సమావేశంలో ప్రస్తావించడం లేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో మన స్టేట్‌లో సీడబ్ల్యూసీ మీటింగ్ ఉండటం వలన సోనియా గాంధీ హాజరు కావాల్సి వచ్చిందని నేతలు వెల్లడిస్తున్నారు. ఆ తర్వాత మరోసారి స్టేట్‌కు రావాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలుమార్లు ఆహ్వానాలు వెళ్లినా ఆమె రాలేదు. ఈ దఫా మాత్రం స్టేట్ ఆఫీషియల్ సెలబ్రేషన్స్‌తో పాటు ప్రజలకు సెంటిమెంట్‌తో ముడి పడిన నేపథ్యంలో ఆమె రానున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే స్పీచ్‌ను పార్టీ తయారు చేసినప్పటికీ, ఆరోగ్యం దృష్ట్యా ఆమె తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.