TRS, BJP మధ్య సోషల్ మీడియా వార్!

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ పోరు ముదిరి పాకాన పడుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.

Update: 2022-11-23 13:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ పోరు ముదిరి పాకాన పడుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం అంశంతో మలుపు తీసుకున్న రాష్ట్ర రాజకీయం ఎమ్మెల్యేల కొనుగోలు అంశం వైపు మళ్లడంతో చల్లటి చలికాలంలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. నేతల మాటలు పరస్పరం రాజకీయ యుద్ధవాతావరణాన్ని తలపిస్తుంటే మరో వైపు సోషల్ మీడియాలో ఇరు పార్టీల మద్దతు దారులు వార్ కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో నువ్వొకటి అంటే నేను రెండు అని చూపిస్తా అన్న చందంగా టీఆర్ఎస్, బీజేపీ పార్టీల సపోర్టర్స్ సోషల్ మీడియాలో కామెంట్స్, మీమ్స్ లతో విషయాన్ని మరింత పీక్స్ కు తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ యాష్ ట్యాగ్ తెలుగు రాష్ట్రాల్లో ట్రెడింగ్ జాబితాలోకి వచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంపై టీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో బీజేపీని టార్గెట్ చేస్తోంది. తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీజేపీ పెద్దలు చేశారని స్వయంగా కేసీఆరే ఆరోణలు చేశారు. ఇందుకు కొంత మంది రాజకీయ బ్రోకర్లను చర్చలకు పంపించారని కానీ తమ ఎమ్మెల్యేలు ధైర్యంగా ఎదుర్కొన్నారని కితాబిచ్చారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు సిట్ విచారణ జరుపుతోంది.

ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సిట్ అధికారులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. అయినా ఆయన విచారణకు రాలేదు. ఈ క్రమంలో #Lotus Leaks (#లోటస్ లీక్స్) పేరుతో బీజేపీపై టీఆర్ఎస్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తోంది. రకరకాల కామెంట్స్, మీమ్స్ తో బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. 'సిట్ విచారణకు హాజరుకావాలని బీఎల్ సంతోష్‌కు నోటీసు ఇస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు ఏడ్వాలి? బీఎల్ సంతోష్ చట్టానికి అతీతుడా? సంతోష్ విచారణకు వస్తే బీజేపీతో రామచంద్ర భారతికి ఉన్న మొత్తం అనుబంధం బయటకు వస్తుంది. అలాగే భారత ప్రభుత్వంలోని వారి చీకటి కోణాన్ని బట్టబయలు అవుతుంది' అందుకే సంతోష్ విచారణకు రావడం లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. సిట్ సమన్లతో పాటు నరేంద్ర మోడీ 2014 కు ముందు ఒకరకంగా ఆ తర్వాత మరోరకంగా వ్యవహరిస్తున్నాడని బైకాట్ బీజేపీ, టోటస్ లీక్స్ అంటూ యాష్ ట్యాగ్ లతో షేర్ చేస్తున్నారు.

ఇక టీఆర్ఎస్ ప్రచారంపై బీజేపీ సోషల్ మీడియా సైతం అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. టీఆర్ఎస్ నేతలపై వరుసగా జరుగుతున్న ఐటీ, ఈడీ రెయిడ్స్ ను బీజేపీ మద్దతు దారులు ప్రస్తావిస్తున్నారు. ఐటీ రెయిడ్స్ యాష్ ట్యాగ్ తో ఎదురుదాడికి దిగుతున్నారు.

Tags:    

Similar News