ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ : మంత్రి పొంగులేటి ప్రకటన

తెలంగాణ యువత భవిత కోసం తమ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-26 11:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ యువత భవిత కోసం తమ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులకు నైపుణ్య విద్య అందించడానికి ఈ ప్రభుత్వం స్కిల్ యునివర్సిటీని ఏర్పాటు చేసిందని, ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. యూసుఫ్ గూడలోని నిమ్స్ మే లో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్వల్పకాలిక శిక్షణ పథకం కింద "స్వచ్చత హి సేవా" ఈవెంట్ ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించే అగ్రగామి గమ్యస్థానంగా తెలంగాణాను తీర్చిదిద్ది, స్థానికంగాను, విశ్వవ్యాప్తంగాను సులభంగా ఉద్యోగాలు పొందడానికి అవసరమైన నైపుణ్య అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

తెలంగాణా యువకులకు స్కిల్ పెంపొందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. ఈ ధ్యేయంతో తెలంగాణా ప్రభుత్వం హైదరాబాద్ లో పబ్లిక్ -ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణను స్థాపించిందన్నారు. ఇందులో వివిధ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పే 17 రకాల సర్టిఫికెట్, డిప్లమో, డిగ్రీ కోర్సులను ఏర్పాటు చేసిందని, ఉద్యోగార్జనే ఏకైక లక్ష్యంగా ఈ కోర్సుల బోధనాంశాలకు రూపకల్పన చేస్తామన్నారు. ఆధునిక ప‌రిశ్రమ‌ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా యువ‌త‌ను తీర్చిదిద్దేందుకుగానూ ఐటీఐల‌ను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఏటీసీ) మారుస్తున్నామన్నారు. అందుకనుగుణంగా తెలంగాణ‌లోని 65 ఐటీఐల‌ను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాల‌జీస్ లిమిటెడ్ (టీటీఎల్‌)తో ప‌దేళ్లకుగానూ అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఆధునిక ప‌రిశ్రమ‌ల‌కు అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఏటీసీల్లో యువ‌త‌కు శిక్షణ ఇస్తారు. ఏటీసీల్లో అధునాత‌న సామ‌గ్రి, సాంకేతిక‌త ఏర్పాటు చేస్తారు.

శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణుల‌ను టీటీఎల్ నియ‌మిస్తుంది. ఏటీసీల్లో ఏటా 15,860 మందికి ఆరు ర‌కాల దీర్ఘకాల కోర్సుల్లో, 31,200 మందికి 23 ర‌కాల స్వల్పకాలిక కోర్సుల్లో శిక్షణ అందిస్తారన్నారు. గ‌త ప‌దేళ్లలో రాష్ట్రంలోని ఐటీఐల్లో కేవ‌లం 1.5 ల‌క్షల మంది మాత్రమే శిక్షణ పొందగా, ఈ ఏటీసీల‌తో రానున్న ప‌దేళ్లలో నాలుగు ల‌క్షల మంది శిక్షణ పొందే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు. రూ.2,324 కోట్ల వ్యయంతో ఐటీఐల‌ను ఏటీసీలుగా మార్చబోతున్నామని ప్రకటించారు. ఏటీసీలు కేవలం వివిధ కోర్సుల్లో శిక్షణకే ప‌రిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా ప‌ని చేస్తాయన్నారు. అలాగే ఈ ఏటీసీలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు చిన్న, సూక్ష్మ, మ‌ధ్యత‌ర‌హా ప‌రిశ్రమ‌లు, భారీ ప‌రిశ్రమ‌ల‌కు సాంకేతిక కేంద్రాలుగానూ (టెక్నాల‌జీ హ‌బ్‌) ప‌ని చేస్తాయన్నారు.


Similar News