మేయర్ విజయలక్ష్మీకి షాక్! లైట్ తీసుకోవాలని ఆదేశించడంతో..
రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జారీచేసే ఆదేశాలను అధికారులు పట్టించుకునే అవసరం లేదని, ఎలాంటి ఆదేశాలిచ్చినా, లైట్ తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
దిశ, సిటీబ్యూరో : రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జారీచేసే ఆదేశాలను అధికారులు పట్టించుకునే అవసరం లేదని, ఎలాంటి ఆదేశాలిచ్చినా, లైట్ తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఇటీవల నిర్వహించిన జోనల్ కమిషనర్ల సమావేశంలో మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
జీహెచ్ఎంసీలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా నగరంలోని ఆరు జోన్లలో జీతాల చెల్లింపు ప్రక్రియను తెలుసుకోవటంతో పాటు ఇతర పౌరసేవల నిర్వహణ, వివిధ రకాల అభివృద్ధి పనుల పురోగతిపై కమిషనర్ రెండు రోజుల క్రితం ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది. ఈ సమీక్షలో పలువురు జోనల్ కమిషనర్లు మేయర్ జారీచేసిన ఆదేశాల మేరకు పలు అభివృద్ధి పనులు, పరిపాలనపరమైన సిబ్బంది బదిలీలు, నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనలను కమిషనర్‌కు వివరించినట్లు సమాచారం.
మొత్తం సమావేశంలో జోన్ల వారీగా మేయర్ సిఫార్సు చేసిన ఆదేశాలను, పలు డివిజన్లలో అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలన్నింటినీ పరిశీలించిన కమిషనర్ మేయర్ ఆదేశించే పనులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే నగరంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా సమీక్షలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే పలు నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి పలువురు ఎమ్మెల్యేల పేర్లను జోనల్ కమిషనర్లు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం.
అసలే ఆర్థికసంక్షోభంలో ఉన్న జీహెచ్ఎంసీలో కనీసం సకాలంలో ఉద్యోగులు, కార్మికులకు జీతాలు చెల్లించలేని దుస్థితి నెలకొందని, ఇది చాలా బాధాకరమన్న విషయాగన్ని వ్యాఖ్యానించిన కమిషనర్ ఎవరెలాంటి ఆదేశాలిచ్చినా, ఆర్థికపరమైన విషయాలను పరిగణలోకి తీసుకుని, జోనల్ కమిషనర్లు ఆచితూచీ వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం.
కార్పొరేటర్లకు బడ్జెట్ ఉంటుందా?
కార్పొరేటర్లకు ఎలాంటి బడ్జెట్ కేటాయించకుండా, కనీసం పార్టీల వారీగా ఫ్లోర్ లీడర్లను సైతం నియమించుకునే వెసులుబాటు కల్పించని బీఆర్ఎస్ సర్కారు ఓటమిపాలై, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హయాంలోనైనా కార్పొరేటర్లకు వార్షిక బడ్జెట్ కేటాయిస్తారా? అన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లే ఎక్కువ మంది ఉండటంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉండటంతో బడ్జెట్ కేటాయించే అవకాశాల్లేకపోవచ్చునన్న వాదనలు ఉన్నాయి.
కానీ ప్రస్తుతమున్న పాలకమండలి ఇప్పటి వరకు మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నందన, రానున్న మరో రెండేళ్లలో మళ్లీ జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశముండటంతో బల్దియాలోనూ మూడు రంగుల జెండాను ఎగురవేసే వ్యూహంలో భాగంగా సర్కారు కార్పొరేటర్లకు వార్షిక బడ్జెట్ కేటాయించే అవకాశమున్నట్లు కూడా చర్చ లేకపోలేదు. ఈ విషయంపై త్వరలోనే సీఎం రేవంత్ నిర్వహించనున్న జీహెచ్ఎంసీ రివ్యూలో క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లు సమీక్షలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.