Tg High Court: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో బీఆర్ఎస్ నేతకు హైకోర్టు షాక్
జన్వాడ ఫాంహౌస్ కూల్చివేతపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో : జన్వాడ ఫామ్‌హౌస్ విషయంలో హైడ్రాకు హైకోర్టులో ఊరట లభించింది. ఫామ్‌హౌస్‌ను కూల్చకుండా స్టే విధించాలని బీఆర్ఎస్ నేత ప్రదీప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం ఇవాళ తోసిపుచ్చింది. కూల్చివేతపై జీవో నెంబర్ 99 నింబంధనల ప్రకారం హైడ్రా నడుచుకోవాలని ఆదేశించింది. అలాగే ఫామ్‌హౌస్‌కు సంబంధించిన అన్ని పత్రాలను పరిగణలోకి తీసుకుని తదనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. కూల్చివేతల విషయంలో అది 60 గజాలైనా 60 ఎకరాలైనా సరే రూల్స్ ప్రకారమే ఉండాలని స్పష్టం చేసింది.
హైడ్రా ఏర్పాటు అభినందనీయమే.. కానీ..
ఉద్దేశపూర్వకంగానే హైడ్రా జన్వాడలోని తన ఫామ్‌హౌన్‌ను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నదని, కూల్చవద్దంటూ బీఆర్ఎస్ నేత, కేటీఆర్ స్నేహితుడు ప్రదీప్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను ఇవాళ లంచ్ బ్రేక్ అనంతరం మరోసారి విచారణ జరిపిన హైకోర్టు.. ఏ ప్రాతిపదికన హైడ్రాను ఏర్పాటు చేశారని, దాని లీగల్ స్టేటస్ ఏంటని ప్రశ్నించింది. హైడ్రా ఏర్పాటును అభినందిస్తున్నామని, కానీ దానికి ఉన్న పరిమితులు ఏంటని అడిగింది. నిర్మాణాలకు ప్రభుత్వంలోని ఒక శాఖ అనుమతి ఇస్తుంటే మరో శాఖ కూల్చివేస్తున్నదని పేర్కొన్నది. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాలని హైడ్రాను ఆదేశించింది. కూల్చివేతలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న హైకోర్టు.. ఇప్పటివరకు ఎన్ని కట్టడాలను కూల్చివేశారని, నిబంధనలు పాటించారా? అని ప్రశ్నించింది. పూర్తి వివరాలను ఇవ్వాలని ఏఏజీని హైకోర్టు ఆదేశించింది.
ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసమే..
హైదరాబాద్‌లో క్రమంగా ఆక్రమణలు ఎక్కువయ్యాయని, అందువల్ల ప్రభుత్వ భూములు, చెరువులు నాళాల పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పాటు చేశారని ఏఏజీ ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఓఆర్ఆర్ పరిధిలో జీహెచ్ఎంసీతో కలిసి హైడ్రా పని చేస్తున్నదని, నిబంధనల మేరకే నడుచుకుంటున్నామని క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ పిటిషన్‌కు విచారణ అర్హతే లేదని, హైడ్రా 111 జీవో పరిధిలోకి రాదని, స్థానిక నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోకి ఈ ప్రాంతం వస్తుందని ఏఏజీ కోర్టుకు తెలిపారు. కాగా కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.