BRS మాజీ ఎమ్మెల్యేకు షాక్.. కేసు నమోదు చేయాలని పోలీసుల నిర్ణయం!

తప్పు చేసిన కొడుకును కేసు నుంచి తప్పించిన బోధన్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌పై కేసులు నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు.

Update: 2024-01-02 07:31 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : తప్పు చేసిన కొడుకును కేసు నుంచి తప్పించిన బోధన్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌పై కేసులు నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. దీనికి సహకరించిన పంజాగుట్ట అప్పటి సీఐ దుర్గారావుపై కూడా కేసులు రిజిస్టర్ చేయాలని భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ ఇటీవల తన బీఎండబ్ల్యూ కారును విపరీతమైన వేగంతో నడిపి ప్రజా భవన్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టిన విషయం తెలిసిందే.

ప్రమాదం జరిగినపుడు అక్కడే ఉన్న పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. సోహెల్‌ను పోలీస్ స్టేషన్‌కు సైతం తీసుకెళ్లారు. అయితే, ఆ తర్వాత స్టేషన్‌కు వచ్చిన షకీల్ మనుషులు సోహెల్‌ను విడిపించుకుని తీసుకెళ్లారు. పోలీసులు సోహెల్‌పై పెట్టాల్సిన కేసులను అతని వద్ద పనిచేస్తున్న ఆసిఫ్ అనే వ్యక్తి‌పై పెట్టారు. విషయం తెలిసి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ స్వయంగా దీనిపై విచారణ జరిపారు.

అప్పట్లో పంజాగుట్ట సీఐ దుర్గారావు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్టు నిర్ధారించారు. ఈ మేరకు ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు. కాగా, కేసు నుంచి కొడుకు సోహెల్‌ను తప్పించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ అతన్ని దుబాయ్ పిలిపించుకున్నాడు. ఈ క్రమంలోనే షకీల్, సీఐ దుర్గారావులపై కేసులు నమోదు చేయాలని అధికారులు తాజాగా నిర్ణయించారు.

Similar News