పందికొక్కుల్లా దోచుకుంటున్నారు : YS Sharmila

ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వేల కోట్లు దోచుకున్నాడని, అవినీతి చేసి కొడుకు ల్యాండ్ బ్యాంక్ గా, కూతురు లిక్కర్ బ్యాంకుగా ఎదిగారని

Update: 2022-12-03 09:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వేల కోట్లు దోచుకున్నాడని, అవినీతి చేసి కొడుకు ల్యాండ్ బ్యాంక్ గా, కూతురు లిక్కర్ బ్యాంకుగా ఎదిగారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ఆరోపణలు చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం పందికొక్కుల్లా దోచుకుంటున్నారని ఫైరయ్యారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా గన్ పార్క్ వద్ద శనివారం ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన తండ్రి వైఎస్సార్ మరణించిన వెంటనే శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకున్నాడన్నారు. తన తండ్రి బతికున్న సమయంలో తెలంగాణ ప్రజల్లో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించేందుకు తీవ్రంగా కృషి చేశారన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత తెలంగాణ ప్రజలు పూర్తి అభద్రతా భావంలోకి వెళ్లిపోయారన్నారు. తెలంగాణ కోసం1200 మంది బలిదానాలు చేసుకుంటే అందులో 500 మందికి మాత్రమే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అంతో కొంతో సాయం చేశారని, మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. ఆ 500 మందిలోనూ కొందరికి ఇల్లు ఇస్తే.., కిందరికి రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. బలిదానాలు చేసిన వారి ప్రాణాలకు కూడా సీఎం వెల కట్టారన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని, మరి వచ్చాక అవన్నీ ప్రజలకు దక్కాయా అని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ 18 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పి కాళేశ్వరం కట్టాడని, కానీ అధికారులు చెప్పిన నివేదికల్లో 53 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందుతున్నట్లుగా తెలిపారన్నారు. ఈ ప్రాజెక్టులను కేవలం ఒక్కరికే ఎందుకిచ్చారో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కేవలం ఆయన కుటుంబానికి కమీషన్లు అందేందుకు మాత్రమే టెండర్లు లేకుండా ఒక్కరికే ప్రాజెక్టులు అందించారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేస్తోందని, రాష్ట్రంలో ఆయన కుటుంబం మాత్రమే బాగుపడిందని, ఆయన కుటుంబీకుల ఆస్తులే పెరిగాయని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు మాత్రం వెనుకబడిపోయారన్నారు. ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు, విద్యార్థులు కలిసి రాష్ట్రం కోసం డారని, తెలంగాణ వచ్చాక ఉద్యోగాల కోసం కొట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉద్యమ ద్రోహి కేసీఆర్ అని ఫైరయ్యారు.

మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్, కోదండరాం ను ఎంత మోసం చేశారో అందరికీ తెలిసిందేనని మండిపడ్డారు. కోటల్లాగా ఫామ్ హౌజ్ లను కట్టుకున్న కేసీఆర్ యావత్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. తన బిడ్డ కవిత ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నాడని, శ్రీకాంతాచారి తల్లి ఓడిపోతుందని తెలిసి కూడా పోటీలోకి నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్ అని ఫైరయ్యారు. కూతురికిచ్చినట్లుగా శ్రీకాంతాచారి తల్లికి ఎందుకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. మలిదశలో పోరాడిన అసలైన ఉద్యమకారులకు పార్టీ తరుపున అండగా ఉంటామని, వారికి ఇండ్లు కూడా ఇస్తామని షర్మిల హామీ ఇచ్చారు. కేసీఆర్ తాలిబన్లలాగా పాలన సాగిస్తున్నాడన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి థర్డ్ క్లాస్ పర్సన్ అని, ఆయనకు విశ్వసనీయత లేదన్నారు. అలాంటి వ్యక్తుల సంబంధించిన ప్రశ్నలు తనను అడగవద్దని స్పష్​టంచేశారు.

ఇవి కుడా చదవండి:  'దొంగ నిరాహార దీక్షలతో తెలంగాణ రాలేదు' 

Tags:    

Similar News