మహిళా IAS చేతులు పట్టుకున్న నీచుడు శంకర్ నాయక్: షర్మిల ఫైర్
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రభుత్వ భూమి దాదాపు 2100 ఎకరాలు కబ్జా చేశాడని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ఆరోపణలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రభుత్వ భూమి దాదాపు 2100 ఎకరాలు కబ్జా చేశాడని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ఆరోపణలు చేశారు. ఆయన చేసిన కబ్జాల వల్ల ఆ జిల్లాలో ప్రభుత్వ భూమే లేకుండా పోయిందని పేర్కొన్నారు. లోటస్ పాండ్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 3 వేల కిలోమీటర్ల మైలురాయి దాటినప్పటి నుంచి తాను చేపడుతున్న ప్రజాప్రస్థాన యాత్రను కేసీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆమె ధ్వజమెత్తారు. గతంలో నర్సంపేటలో.. తాజాగా మహబూబాబాద్ పట్టణంలో ఇది రిపీట్ అయిందని పేర్కొన్నారు. తమ పార్టీకి పెరుగుతున్న అదరణ చూసే యాత్రను అడ్డుకునేందుకు కేసీఆర్ కుతంత్రాలు చేస్తున్నారని విమర్శలు చేశారు.
లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించింది బీఆర్ఎస్ నేతలని, కానీ తమపై ఆరోపణలు చేసి తమ యాత్రను అడ్డుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ది అవినీతి చరిత్ర అని ఆమె ఆరోపించారు. జర్నలిస్టులకు ఇండ్లు ఇస్తానని చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు దోచుకున్నారని వివరించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన మోసంపై జర్నలిస్టులు కేసు పెడదామని వెళ్తే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించారన్నారు. మహబూబాబాద్‌లో తమ అంబులెన్స్, ఎస్కార్ట్ వాహనాలను, తాను బస చేసే టెంట్ ను సైతం బీఆర్ఎస్ గుండాలు ధ్వంసం చేశారన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోందని విరుచుకుపడ్డారు. ఇది తాలిబన్ రాజ్యంగా మారిందని, ఈ అంశాలపై వీలు చూసుకుని గవర్నర్ తమిళి సైని కలుస్తానని షర్మిల స్పష్టంచేశారు.
ఒకరేమో మరదలని అన్నాడని, ఇంకొకరు కొజ్జా అని, మంత్రి కేటీఆర్ వ్రతాలు చేసుకోవాలని, ఒకరు శిఖండి, ఇంకొకరు నల్లిని నలిపినట్లు నలిపేస్తానని హెచ్చరించినా తాము స్పందించకూడదా అని షర్మిల ప్రశ్నించారు. వాళ్ళు అంటే తప్పు లేదు, తిరిగి కౌంటర్ ఇస్తే తప్పా అని ఆమె పేర్కొన్నారు. శంకర్ నాయక్ కొజ్జా అన్న పదం ఎందుకు వాడాడని, అదే తాను వాడితే తన యాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. మహిళా ఐఏఎస్ చేతులు పట్టుకున్న నీచుడు శంకర్ నాయక్ అని, ఆ అధికారి కేసు పెట్టినా ఇప్పటి వరకు కనీసం సారీ కూడా చెప్పలేదని షర్మిల ధ్వజమెత్తారు. భార్యను అడ్డు పెట్టుకుని ఆయన నీచ రాజకీయం చేస్తున్నాడని విరుచుకుపడ్డారు. శంకర్ నాయక్ భార్య కూడా తక్కువేం తినలేదని, గిరిజనుల భూమి లాక్కుందనే అభియోగాలు ఆమెపై ఉన్నాయని, ఏ1 లిస్టులో ఉందన్నారు.
ఇక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఆడవాళ్లు అయ్యుండి మాట్లాడుతున్నారని విమర్శలు చేశారని, మహిళలైతే మాట్లాడకూడదా? అని ఆమె ప్రశ్నించారు. ఇది కేవలం తనకు మాత్రమే జరిగిన అన్యాయం కాదని, యావత్ తెలంగాణ ప్రజలు, మహిళలకు జరిగిన అవమానంగా పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు ఎన్నటికీ గౌరవమివ్వదని, ఆయనపై పోరాడటానికి అందరూ.. ఒక్క తాటిపైకి రావాలని షర్మిల పిలుపునిచ్చారు. ఈ విషయంలో మళ్ళీ కోర్టు కేసులు అవుతాయని, కేసీఆర్‌కు మొట్టికాయలు వేయిస్తే కానీ ఆయన తిక్క కుదరదని ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు అక్రమాలు, భూకబ్జా, దందాలు తప్పితే ప్రజలకు చేసిందేమిటో సమాధానం చెప్పాలని ఆమె నిలదీశారు.
ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రజలను దోచుకుని వందల కోట్లు కూడబెట్టుకున్నారని, ఎన్నికల్లో డబ్బు పంచే సత్తా వారికుందని తెలిసే సిట్టింగులకే టికెట్లని కేసీఆర్ క్లారిటీ ఇచ్చాడని ఆమె అభిప్రాయం వ్యక్తంచేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసేది అసలు పాదయాత్రేనా? అని షర్మిల విమర్శించారు. ఇతర పార్టీల నేతలు ఎందరో పాదయాత్ర చేస్తున్నా.. ఎవరికీ రానంత ఆదరణ తన యాత్రకు వచ్చిందని ఆమె వెల్లడించారు. కేసీఆర్ కూడా తనకు భయపడుతున్నాడని షర్మిల తెలిపారు. పోలీసులను పనోళ్లలాగా వాడుకుని తన పాదయాత్రను అడ్డుకున్నాడని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలకు నిజాయితీ ఉంటే పబ్లిక్ ఫోరం పెట్టాలని ఆమె సవాల్ విసిరారు.