కాంగ్రెస్‌లోకి మరో ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. చర్చలు సఫలం

కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ పెరిగింది. బీఆర్ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు.

Update: 2024-03-18 02:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ పెరిగింది. బీఆర్ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. తాజాగా గులాబీ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తం గూటికి చేరారు. అదే బాటలో మరో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రెడీ అయినట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే సీఎం రేవంత్ స్పెషల్ టీమ్‌తో వారి ప్రాథమిక చర్చలు కూడా పూర్తయ్యాయి. ఇక చేరిక మాత్రమే మిగిలింది.

రేవంత్‌ను కలిసిన ఎమ్మెల్యేలంతా..!

ఇటీవల సీఎం రేవంత్‌ను కలసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌లోకి వస్తున్నట్టు ఆ పార్టీ కీలక నేతలు చెబుతున్నారు. ఆ జాబితాలో కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, తెల్లం వెంకట్రావ్, ప్రకాశ్​గౌడ్, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, మానిక్ రావు ఉన్నట్టు హస్తం పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ హైకమాండ్ కూడా బీఆర్ఎస్, బీజేపీ నేతల చేరికలకు అనుమతి ఇచ్చినట్టు తెలిసింది. కానీ, చేరికలపై ఆయా ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. లీకులు కూడా అందకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తున్నది.

చివరి వరకు సస్పెన్స్..

పార్టీ మారడం లేదంటూ చివరి వరకు చెప్పుకొచ్చిన దానం.. ఉన్నట్టుండి ఏఐసీసీ దీపాదాస్ మున్షీ సమీక్షంలో ఆదివారం కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో బీఆర్ఎస్ నేతలు షాక్ కు గురయ్యారు. ఘర్ వాపసీ లో భాగంగానే ఆయనను కాంగ్రెస్‌లో చేర్చుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇన్నాళ్లుగా పరిపాలన‌పై ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్.. ఇక నుంచి జాయినింగ్సే ధ్యేయంగా ముందుకు సాగనున్నది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇదే విధానం కొనసాగనున్నది. జాయినింగ్స్‌పై చర్చల కోసం సీఎం రేవంత్ ఏర్పాటు చేసిన ప్రత్యేక టీమ్ ఇదే పనిలో నిమగ్నమైంది. ప్రతి రోజూ కీలక నేతలు, పార్టీ బలోపేతం కోసం కృషి చేసే నాయకుల కదలికలపై ఈ టీం దృష్టి సారించింది. బీఆర్ఎస్, బీజేపీపై అసంతృప్తి వ్యక్త పరిచిన నాయకులతో వెంటనే చర్చలు జరిపి పార్టీలోకి లాగేస్తున్నది. తాజాగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్ ఫ్యామిలీ, పట్నం సునీతా మహేందర్ రెడ్డి, సిట్టింగ్ ఎంపీలు రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, తదితర నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు సీఎం పొలిటికల్ అఫైర్స్ టీమ్ తీవ్రంగా శ్రమించింది. ఈ ఏడుగురు చేరికల తర్వాత మరి కొంత మంది కీలక నేతలను ఆకర్ష్​కాంగ్రెస్ పేరిట కండువాలు కప్పనున్నట్టు సీఎం రేవంత్ టీమ్‌కు చెందిన ఓ కీలక నేత వెల్లడించారు.

గేట్లు ఓపెన్?

రాష్ట్రంలో పవర్‌లోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, ముందుకు సాగాలని గతంలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది. ఇతర పార్టీ పేరుతో గెలిచిన వారిని పార్టీలో చేర్చుకోవద్దని తొలుత సూత్రపాయ నిబంధనను పెట్టుకున్నది. ప్రజలు ఇచ్చిన ఫలితాలతోనే ప్రభుత్వాన్ని నడిపించాలని భావించింది. మేలో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నాయి. ఇదే టైమ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పదే పదే ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని అధికార పార్టీ.. విషయాన్ని ఢిల్లీలోని హైకమాండ్‌కు వివరించింది. పలు దఫాలుగా చర్చలు జరిగిన తర్వాత జాయినింగ్స్‌పై దృష్టి పెట్టాలని ఏఐసీసీ నుంచి రాష్ట్ర పార్టీకి ఆదేశాలు అందాయి. సీఎం, మంత్రులు కూడా ఏకాభిప్రాయానికి వచ్చి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతోనే పార్టీ‌లో చేరికల గేట్లు తెరిచామని సీఎం సైతం వెల్లడించారు. స్థానిక పరిస్థితులు, రాజకీయ వృద్ధి, పార్టీ బలోపేతం లాంటి వివిధ సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటూ జాయినింగ్స్ ఉంటాయని పార్టీ నేత ఒకరు తెలిపారు.

ఎల్పీ విలీనం వరకు చేరికలేనా?

గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకున్నట్లే, ఇప్పుడు కాంగ్రెస్ సైతం అదే విధానాన్ని అవలంభించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజకీయ మనుగడ కోసం చేరికలు తప్పవంటూ పార్టీ నేతలు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ ఎల్పీ విలీనం కోసం 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరే వరకు అధికార పార్టీ రాజకీయ వ్యూహాన్ని అమలు చేయనున్నది. గతంలో తమ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని బీఆర్ఎస్ చేర్చుకున్నదని సీఎల్పీని విలీనం చేసుకున్నదని కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు తాము సైతం అలాగే చేస్తామని కాంగ్రెస్ కీలక నేతల బలంగా చెబుతున్నారు. ఇదే జరిగితే బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ చేసిన తప్పునే కాంగ్రెస్ చేసిందనే విమర్శలు పబ్లిక్ నుంచి ఎదురయ్యే చాన్స్ ఉన్నది. కానీ కాంగ్రెస్ మాత్రం సీరియస్‌గా గ్రౌండ్ వర్క్‌ను మొదలు పెట్టడం గమనార్హం. బీఆర్‌ఎస్‌లో కేవలం 12 మందిని మాత్రమే మిగల్చాలని అధికార పార్టీ లక్ష్యం పెట్టుకున్నది.

Tags:    

Similar News