రాష్ట్రంలో సంచలన ఘటన.. వివస్త్రను చేసి దళిత యువతిపై దాడి

కామారెడ్డి జిల్లాలో ఆమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-02-09 03:53 GMT

దిశ, మాచారెడ్డి: కామారెడ్డి జిల్లాలో ఆమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దళిత అమ్మాయిని వివస్త్రను చేసి ప్రైవేట్ పార్ట్‌లపై కారంపొడి చల్లి కర్రలతో భౌతిక హింసకు పాల్పడ్డారు. ప్రేమించి పెళ్లి చేసుకుందనే అక్కసుతో దాడికి పాల్పడ్డారు. అయితే ఆమె ప్రేమించిన వ్యక్తికి ఇది రెండో పెళ్లి అని తెలిసింది. మొదటి భార్య తన బంధువులు గ్రామస్తులతో ఈ దాడికి పాల్పడినట్టు సమాచారం. నా భర్తను విడిచిపెట్టి పోతావా లేదా అంటూ వారిద్దరిని గద్దిస్తూ బట్టలు విప్పి ఆమె ప్రైవేటు పార్ట్‌లపై కారంపొడి చల్లుతూ కర్రలతో కొడుతూ హింసకు పాల్పడ్డారు.

పోలీసులకు ఫిర్యాదు చేసినా అది నా పరిధి కాదంటూ పట్టించుకోకపోవడం శోచనీయం. గ్రామ పెద్దలు పదివేల రూపాయల అడ్వాన్స్ తీసుకొని సైలెంట్‌గా ఉండిపోయారు. ఈ విషయం ఆ నోట ఈ నోట, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత యువతి, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన సందాని నరేష్ (27) వీరిద్దరూ రెండో పెళ్లి చేసుకున్నారు.

రామారెడ్డి లో ప్రైవేట్ రైస్ మిల్లులొ కూలి పని చేస్తూ బతుకుతున్నారు. గతంలో నరేష్ అక్కాపూర్ గ్రామానికి చెందిన యువతిని సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చినట్లు తెలిసింది. ఆమెకు ఓ బాబు ఉన్నట్లు సమాచారం. దానిని మనసులో పెట్టుకొని అద్దె ఇంట్లో ఉంటున్న ఆ దంపతులపై తమ బంధువులు, కుల పెద్దలతో దాడికి పాల్పడ్డారు. రామారెడ్డికి వెళ్లి వారిని బంధించి ఇద్దరి బట్టలిప్పి ప్రైవేట్ పార్ట్స్‌లో కారప్పొడి చల్లి, కట్టెలతో దాడికి పాల్పడ్డారు.

స్పృహ కోల్పోయిన వారిద్దరిని కారులో తీసుకొని అక్కాపూర్ గ్రామానికి వచ్చి గాంధీ విగ్రహం దగ్గర కట్టేశారు. ఉదయం దాక ఉంచి కట్లు విప్పారు. తర్వాత మీరు ఎవరికైనా ఈ విషయం చెబితే ఎక్కడికి వెళ్లినా కత్తితో పొడిచి చంపేస్తామని బెదిరించారు. వారు భయంతో ఎవరికి చెప్పలేదు. అయితే ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో విషయంతో బయటకు వచ్చింది. అధికారులు ఇప్పటి వరకు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దళిత అమ్మాయిని వివస్త్రను చేసి విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన ఘటనపై పలువురు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 


Similar News