రేపు ప్రజలకు వాస్తవాలు చెబుతాం.. MLC మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-02-11 11:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగునీటి రంగంలో వాస్తవాలను తెలిపేందుకు కాసేపట్లో అసెంబ్లీ వేదికగా ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అవినీతి, అక్రమాలకు పాల్పడింది కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు రావడానికి బీఆర్ఎస్ నేతలు జంకుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. సందర్శన అనంతరం వాస్తవాలను రేపు అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు వివరంగా చెబుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండలో బీఆర్ఎస్ నిర్వహించబోయే సభ ద్వారా ఒరిగేదేమీ లేదని అన్నారు.

కేసీఆర్ మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరని తెలిపారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. కాగా, ఈ నెల 13వ తేదీన ఎమ్మెల్యేలను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలతో పాటు శాసనమండలిలో ఉన్న 40 మంది సభ్యులు ప్రాజెక్టు సందర్శనకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆహ్వానించారు. 13 ఉదయం 10 గంటలకు శాసనసభ నుంచి ప్రాజెక్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అందరికీ తెలియాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కూడా ఈ సందర్శనకు రావాలని సీఎం ప్రత్యేకంగా ఆహ్వానించారు.

Tags:    

Similar News