సీఎంనైనా నిలదీస్తా: మాజీమంత్రి Jupally Krishna Rao సంచలన వ్యాఖ్యలు
టీఆర్ఎస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, అచ్చంపేట: తప్పు ఎవరు చేసినా తప్పేనని.. అధికార పార్టీ నాయకులైన.. ప్రతిపక్ష పార్టీ నాయకులైన ప్రశ్నించాల్సిందేనని ప్రజల పక్షాన పనిచేస్తేనే సామాన్యులకు మేలు జరుగుతుందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా.. సిట్టింగ్ సీఎం అయినా.. చెప్పేదొకటి చేసేదొకటే అయితే.. వాళ్లను ప్రశ్నిస్తా.. నిలదీస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర నాయకులు రంగినేని శ్రీనివాసరావు అధ్యక్షతన ఆత్మగౌరవ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి జూపల్లి హాజరై ఆయన మాట్లాడుతూ.. జై తెలంగాణ.. జోహార్ తెలంగాణ అమరవీరులకు అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. సుమారు రెండు దశాబ్దాలుగా అచ్చంపేట ప్రజలతో సంబంధాలు ఉన్నాయని, ఆత్మీయ సమ్మేళనానికి రావాలని ఒక రోజు ముందుగా సమాచారంతో అందరికీ చెప్పలేకపోయారని.. ముందు ముందు అన్ని మండలాలలో పర్యటిస్తూ ప్రతి నాయకుని వ్యక్తిగతంగా కలుస్తానని తెలిపారు.
ఆత్మగౌరవం..
నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఆనాడు ఉద్యమం మొదలై రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. కానీ ఆత్మగౌరవం పూర్తిగా ఆభాసు పాలు అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాల ఏర్పాటు గర్వించదగ్గ విషయమని.. కానీ అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదని ఆయన మండిపడ్డారు.
ధరణి, పోలీస్‌తో సామాన్యుడు..
రాష్ట్రంలో ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత సామాన్య రైతులకు సామాన్యులకు కష్టాలు మరింత ఎక్కువ అయ్యాయని.. గ్రామ సర్పంచ్ స్థాయిలో చిన్న పొరపాటు జరిగితే వారిపై వేటు వేసే ఈ ప్రభుత్వం.. అధికారులు తప్పు చేస్తే కళ్ళు మూసుకుని ఉండడం దుర్మార్గం అన్నారు. ఒక కొల్లాపూర్ నియోజక వర్గ కేంద్రంలోని 16 వందల ఎకరాలకు సంబంధించిన విషయం ధరణి తప్పిదాలపై జిల్లా రెవిన్యూ అధికార యంత్రంగానికి ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం లేదని.. నేరుగా రాష్ట్ర సీఎస్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకునే పరిస్థితి నేటికి లేదని మరి సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
నిద్రమత్తులో వారు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో సమస్యలు పరిష్కారం కాకుండా.. అధికారులు తప్పులు చేస్తున్న పట్టించుకునే నాధుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన అన్యాయాలను అరికట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేసిన వారిపైనే తిరిగి కేసులు.. బూటు కాలుతో తన్నడం లాంటి దుర్మార్గమైన దుస్థితి కొల్లాపూర్‌లో రాజ్యమేలుతుందని మాట్లాడుతుండగా.. అచ్చంపేటలో అదే పరిస్థితి ఉందని సభకు హాజరైన వారు జూపల్లి దృష్టికి తీసుకెళ్లారు. పోలీసుల తీరు చాలా దుర్మార్గంగా ఉందని పోలీస్ వ్యవస్థ ఏమయిందని ఆయన ప్రశ్నించారు.
పదవులు ఏనాడు..
మొదటినుండి పదవుల కోసం ఏనాడు పాకులాడలేదని ప్రజల పక్షాన నిలబడితే ప్రజల సమస్యలపై పోరాటం చేసినవారికి పదవులు అవే వస్తాయన్నారు. ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నా ఎవరు పిలిచినా వారి పక్షాన పోరాటం చేయడానికి సమస్య ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్న గతంలో, ఇప్పుడు, రేపు ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు యుద్ధానికి సిద్ధమేనని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఆ సమ్మేళనానికి వచ్చింది..
అచ్చంపేట నియోజకవర్గంలో మంత్రి జూపల్లి ఆత్మీయ సమ్మేళనానికి 8 మండలాల నుండి భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కావడంతో.. తిరిగి మాజీ మంత్రి జూపల్లి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారనే చర్చ జోరుగా కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆత్మీయ సమ్మేళనానికి అత్యధికులు కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చారని.. తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారా అని ''దిశ'' ప్రశ్నించగా.. సమస్యలున్న చోటనే నా పోరాటం అని.. ఎవరు పిలిచినా వెళ్తానని దాటవేత ధోరణి ప్రదర్శించారు.
Read more: