ఈటల రాజేందర్‌ను అవమానించారు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కేవలం కుటుంబ పాలనకే పరిమితమైందని ఎద్దేవా చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కేవలం కుటుంబ పాలనకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. అందుకే ప్రజలు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని తెలిపారు. కానీ, ప్రజా తీర్పును ఇంకా బీఆర్ఎస్ నేతలు అంగీకరించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదని అన్నారు. ప్రజా తీర్పును గౌరవించకపోతే ఎవరినైనా బయటకు పంపుతారని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పదేళ్లుగా ఏనాడూ ప్రజలకు ప్రగతి భవన్‌లోకి అనుమతి ఇవ్వలేదని గుర్తుచేశారు.
అలాంటి రాచరికపోకడలను తెలంగాణ ప్రజలు సహించబోరని.. ఓటు రూపంలో బీఆర్ఎస్‌కు బుద్ది చెప్పారని అన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ చుట్టూ ఏర్పాటు చేసుకున్న ఇనుప కంచెలను బద్దలు కొట్టామని అన్నారు. గత ప్రభుత్వం ప్రజలను అడుగు పెట్టకుండా చేసిన ప్రగతి భవన్‌లో ప్రజావాణి కార్యక్రమంతో నేరుగా సీఎంకే సమస్యలు చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చామని తెలిపారు. సొంత పార్టీ నేత, మంత్రిగా కొనసాగుతున్న ఈటల రాజేందర్‌నే ప్రగతి భవన్‌లోకి అనుమతించకుండా అవమానించారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనించారని, అందుకే బీఆర్ఎస్‌ను ప్రతిపక్షంలో కూర్చొబెట్టారని అన్నారు.