కలిసి పని చేసేందుకు సిద్ధమే.. పొత్తులపై జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పొత్తులపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తు తప్పదు అనుకుంటే అది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.

Update: 2023-03-31 09:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పొత్తులపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తు తప్పదు అనుకుంటే అది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పని చేస్తామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన జానారెడ్డి.. బీజేపీ నియంతృత్వ పోకడలను అడ్డుకునేందుకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. పొత్తుల అంశాన్ని జాతీయ స్థాయిలో హైకమాండ్ నిర్ణయిస్తుందని జానా స్పష్టం చేశారు. బీజేపీపై పోరుకు ఎన్నికలకు సంబంధం లేదన్నారు. ఏయే పార్టీలతో కలిసి పని చేయబోతున్నామనేది అధిష్టానం ముందుగానే తమకు తెలియజేస్తుందని చెప్పారు. బీజేపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియంతృత్వ పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. కేవలం పెట్టుబడుదారులకు వత్తాసు పలుకుతూ విపక్షాలను అణగదొక్కుతోందని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ను బలహీన పరచడానికే బీజేపీ పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను బలహీనపరచడం ద్వారా ఈ దేశంలో అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని బీజేపీ కలలు కంటోందని కానీ అది ఎన్నటికీ జరగదన్నారు. పార్లమెంట్‌లో అదానీ, మోడీల సంబంధాన్ని ప్రశ్నించినప్పటి నుంచే రాహుల్ గాంధీపై కేంద్రం కక్ష్య కట్టిందన్నారు. ఇదిలా ఉంటే పొత్తులపై జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చగా మారాయి. బీజేపీని వ్యతిరేకించే క్రమంలో అవసరం అయితే ఇతర పార్టీలతో కలిసి పని చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందంటూ జానా చేసిన వ్యాఖ్యలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతుందా అనే చర్చ జరగుతోంది. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ సైతం బీజేపీని వ్యతిరేకిస్తోంది. ఇటీవల రాహుల్ గాంధీ అంశంలో కేసీఆర్ సైతం నైతిక మద్దతు తెలిపారు. దీంతో జానారెడ్డి చెబుతున్నట్లు కాంగ్రెస్ కలిసి పనిచేయబోయే పార్టీల జాబితాలో బీఆర్ఎస్ ఉంటే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి అనే చర్చ తెరపైకి వస్తోంది. బీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు ఉండదని రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి పనిచేయబోతోందని జానారెడ్డి వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి.

Tags:    

Similar News