మేడ్చల్ BRS ఎమ్మెల్యేల రహస్య భేటీ.. తెరపైకి కొత్త అంశం!
బీఆర్ఎస్‌లో మంత్రి మల్లారెడ్డి వర్సెస్ మేడ్చల్ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్‌లో మంత్రి మల్లారెడ్డి వర్సెస్ మేడ్చల్ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది. సోమవారం ఉదయం మైనంపల్లి హన్మంతరావు నివాసంలో ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం కృష్ణరావు, అరికెపూడి గాంధీ, కేతి సుభాష్ రెడ్డిలు సమావేశం కావడం సంచలనంగా మారింది. నామినేటెడ్ పోస్టుల విషయంలో మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని.. పదవులన్ని ఆయన అనుచరులకే ఇప్పించుకుంటున్నాడని ఎమ్మెల్యేలు ఆరోపించారు. అయితే ఎమ్మెల్యేల భేటీపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు సమావేశం అయ్యారో తెలియదని అన్నారు.
ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించిన మంత్రి అక్కడే మీడియాతో మాట్లాడుతూ తన జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు సమావేశం అయ్యారో తాను హైదరాబాద్‌కు వెళ్లిన అనంతరం తెలుసుకుంటాన్నారు. ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నట్టుగా తాను పదవులను తన్నుకుపోలేదన్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో తనకు ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. మల్లారెడ్డి వ్యాఖ్యలతో మరోసారి ప్రెస్ మీట్ నిర్వహించిన ఎమ్మెల్యేలు మరింత హాట్ కామెంట్స్ చేశారు.
నామినేటెడ్ పదవుల విషయంలో తాము అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా.. నియామక ప్రక్రియ ఆపడం లేదని ఇదంతా వాటెండ్‌గా జరుగుతోందని మైనంపల్లి హన్మంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేడర్ గురించి మాట్లాడకుంటే తమను డమ్మీ ఎమ్మెల్యేలు అంటారని అన్నారు. తీసుకున్న వారే మళ్లీ మళ్లీ పదవులు తీసుకుంటున్నారని.. మరి మా కేడర్ ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకు తీసుకు వెళ్దామనుకున్నామన్నారు. ఇవాళ మామూలుగా భేటీ అయితే అందుకు సంబంధించి మీడియాకు లీకులు ఇచ్చింది ఎవరని ప్రశ్నించారు.
ఇలాంటి చర్యలు పార్టీకి మరింత డ్యామేజ్ చేస్తాయని మండిపడ్డారు. పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు దక్కాలని.. క్యాడర్‌ను గుర్తించకుంటే పార్టీ కుప్పుకూలుతుందన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నానని.. ఎప్పుడు మన హావానే సాగదని, ఎల్లప్పుడు సంక్షేమ పథకాలే విజయాన్ని అందిచవని అన్నారు. క్యాడర్‌ను గుర్తించకుంటే మరింత కష్టం అవుతుందన్నారు. బీఆర్ఎస్‌కు బ్రహ్మాండమైన కార్యకర్తల బలం ఉందని.. అయితే కొంత మంది మూర్ఖుల వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతోందన్నారు. ఈ వ్యవస్థలో మార్పు రావాలని అన్నారు.
READ MORE
మందు బాబులకు అడ్డాగా మరిమడ్ల పల్లె ప్రకృతి వనం
మంత్రి మల్లారెడ్డి పదవికి ఎసరు.. మైనంపల్లి ఇంట్లో ఎమ్మెల్యేల కీలక నిర్ణయం..??