Munugode bypoll: కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్? ఈ వారంలోనే అధికారిక ప్రకటన

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఉపఎన్నికకు కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కొలిక్కి

Update: 2022-08-24 01:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఉపఎన్నికకు కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పాల్వాయి గోవర్ధన్​ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతికి టికెట్​ ఇచ్చేందుకు ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ సమక్షంలో నిర్ణయం జరిగినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతి.. 15.97 శాతం ఓట్లు సాధించుకుంది. తాజాగా రానున్న ఉప ఎన్నికలో సైతం కాంగ్రెస్​ నుంచి స్రవంతిని పోటీకి దింపేందుకు కాంగ్రెస్​ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే ఏఐసీసీ నుంచి రాష్ట్ర నేతలకు సమాచారమిచ్చారు. త్వరలోనే స్రవంతి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మూడుసార్లు సర్వే

మునుగోడులో కాంగ్రెస్​ పార్టీ మూడుసార్లు సర్వే చేపట్టింది. చివరి సర్వే గ్రామాల వారీగా తీసుకుంది. కొంతమేరకు బీసీ అభ్యర్థి అనే అంశాన్ని కూడా సర్వే సందర్భంగా పరిశీలించారు. కానీ, కాంగ్రెస్​ పక్షాన పార్టీతో పాటుగా కొంత గ్రామస్థాయిలో స్రవంతికే మొగ్గు వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఇక్కడ నుంచి పోటీకి ప్రముఖ రియల్టర్​ చలమల్ల కృష్ణారెడ్డిని తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే హుజురాబాద్​ ఉప ఎన్నికలో కూడా కొత్త అభ్యర్థికి టికెట్​ ఇచ్చి, బొక్కబోర్లా పడ్డారు. మూడువేల ఓట్లు కూడా దక్కకపోవడంతో కాంగ్రెస్​ కు పెద్ద మైనస్​ గా మారింది. ఇదే పొరపాటు మునుగోడులో రిపీట్​ కావద్దని ఏఐసీసీ కీలకమైన ఆదేశాలు కూడా ఇచ్చింది.

స్వతంత్రంగా రెండోస్థానం

పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేతగా ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయనకు తిరుగులేదు. 2014లో పాల్వాయి చనిపోయాక ఆయన కూతురు పాల్వాయి స్రవంతిరెడ్డి తండ్రి స్థానంలో రాజకీయల్లోకి దిగారు. ఆయన ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి 2014లో పోటీచేసి ఓడిపోయారు. మునుగోడులో పాల్వాయికి గట్టి పట్టుండేది. ఆయన అక్కడ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో మాత్రం ఎన్నికల్లో తండ్రి స్థానంలో స్రవంతి రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ సీపీఐతో పొత్తు కారణంగా కాంగ్రెస్ ఈ సీటును సీపీఐకి కట్టబెట్టింది. దీంతో స్రవంతి రెడ్డి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి.. అక్కడ గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్​ రెడ్డి తర్వాత రెండో స్థానంలో నిలిచి సత్తా చాటారు.

తాజాగా రాజగోపాల్​ రెడ్డి రాజీనామా, బీజేపీలో చేరడంతో స్రవంతిరెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు. ఈసారి తనకు టికెట్​ ఇస్తే గెలుపు పక్కా అంటూ మునుగోడులో ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్ తనకు పక్కాగా టికెట్ ఇస్తుందని నమ్మకంగా తిరుగుతున్నారు. ఇటీవల ఒకేరోజు ఒకవైపు టీఆర్​ఎస్​ బహిరంగ సభ, మరోవైపు రేవంత్​ రెడ్డి యాత్రను నిర్వహించినా.. ఈ సెగ్మెంట్​ లో కాంగ్రెస్​ కు బ్రహ్మరథం పట్టారు. దీంతో మునుగోడులో కాంగ్రెస్ బలం తగ్గలేదని నిరూపించారు. మునుగోడు సెగ్మెంట్​ లో కార్యకర్తల పరంగా ఇబ్బంది లేదు. కానీ నేతల వల్లే పెద్ద ఇబ్బంది ఉందంటూ ఏఐసీసీ నేతలు గుర్తించినట్లుగా చెప్తున్నారు. ఓవైపు స్రవంతి సెగ్మెంట్​ లో తిరుగుతుండగా.. ప్రముఖ రియల్టర్ చల్లమల్ల కృష్ణా రెడ్డి సైతం టికెట్ తనదే అని ప్రకటించుకుంటున్నారు. ఆర్ధికంగా బలంగా ఉండటంతో కోమటిరెడ్డిని ఢీకొనే సత్తా కృష్ణారెడ్డికి ఉందనే ప్రచారం జరిగింది. అదే సమయంలో ఈ మధ్యే కాంగ్రెస్ లో చేరిన చెరుకు సుధాకర్ సైతం టికెట్ రేసులో ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన సుధాకర్ కు టికెట్ వస్తుందనే ప్రచారం కూడా జరిగింది. ఇలా మునుగోడు కాంగ్రెస్ టికెట్ విషయంలో ట్రైయాంగిల్ ఫైట్ నడుస్తోంది.

స్రవంతికే మొగ్గు

మునుగోడులో పార్టీ అభ్యర్థి అంశంలో టీపీసీసీ నుంచి కూడా నివేదిక తీసుకున్నారు. అటు వ్యూహకర్త సునీల్​ టీం నుంచి సర్వే రిపోర్ట్​ లు ఏఐసీసీ తీసుకుంది. ఇప్పటికే పార్టీ నేతల మధ్య విభేదాలు వస్తున్న నేపథ్యంలో టికెట్​ ఎవరికి అనే విషయంపై క్లారిటీ ఇవ్వాలని ఏఐసీసీ భావించింది. దీనిలో భాగంగా సోమవారం కీలక నేతలతో ఏఐసీసీ నేతలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్​ సమావేశమై ఈ అంశంపై చర్చించారు. టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి మాత్రం కృష్ణారెడ్డి వైపు మొగ్గు చూపించినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. కానీ, నల్గొండ ఉమ్మడి జిల్లా సీనియర్లు ఉత్తమ్​, జానారెడ్డి మాత్రం స్రవంతికి టికెట్​ ఇవ్వాలని ఏఐసీసీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే మునుగోడులో పోటీ చేసే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఢిల్లీలో సమావేశానికి హాజరైన సీనియర్​ నేతలు చెప్పారు.

Revanth Reddy : వ్యూహం మార్చిన యాంటీ రేవంత్ టీం.. ఇకపై నేరుగా ఆమెతోనే డీల్.

Tags:    

Similar News