కాంగ్రెస్ బండారం బట్టబయలు.. వారిని వదిలే ఛాన్సే లేదు.. ఫైక్ వీడియోపై బండి సంజయ్ రియాక్షన్

తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లుగా నీచ రాజకీయాలు జరుగుతున్నాయని ఇక్కడ జరుగుతున్న రాజకీయాలను చూసి దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు.

Update: 2024-04-30 10:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లుగా నీచ రాజకీయాలు జరుగుతున్నాయని ఇక్కడ జరుగుతున్న రాజకీయాలను చూసి దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా భార్యాభర్తల సంభాషణలు వింటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్ వీడియోలు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర హోం శాఖ మంత్రి అనని మాటలను అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే బీజేపీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఏ స్థాయిలో భయం ఏర్పడిందో అర్థం అవుతోందన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ భయంతో బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దానికంటే రెండింతలు భయపడుతోందని విమర్శించారు. మంగళవారం వేములవాడలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. మే 8న కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని వేములవాడలో జరగబోయే ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను అందరూ విజయవంతం చేయాలని కోరారు.

కాంగ్రెస్ ను వదిలే ప్రసక్తే లేదు:

తెలంగాణలో అత్యధిక స్థానాలు బీజేపీ గెలవబోతున్నదని అన్ని సర్వే రిపోర్టులు చెబుతున్నాయని దీంతో కాంగ్రెస్ కు భయం పుట్టుకుందని దాంతో రిజర్వేషన్ల విషయంలో అబద్ధాలు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టింది. అంబేద్కర్ ను అవమానించి ఓడించిందే కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. ఈ దేశంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాజ్యాంగానికి భిన్నంగా ఎవరైనా వ్యవహరిస్తే దాన్ని అడ్డగించే పార్టీ బీజేపీ అన్నారు. తెలంగాణలో వార్ వన్ సైడ్ అయ్యేలా పరిస్థితులు కనిపించడంతో కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తోందని అన్నారు. ప్రజలు ఆరు గ్యారెంటీలను ప్రశ్నిస్తున్నండంతో వాటిపై ప్రజల దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ దొంగ అవతారమెత్తి రిజర్వేషన్ల విషయంలో ప్రజలను అయోమయానికి గురి చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. దొంగ వీడియోలతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర చేస్తోందని ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ నీచానికి దిగజారుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బండారం బయటపడిందని బీజేపీ వీరిని వదిలిపెట్టదన్నారు.

కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఎవరికీ తెలియదు:

కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఎవరికీ తెలియదన్నారు. ఆ అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చాడు? ఉద్యమంలో ఎన్నడూ కనిపించాడా?, ప్రజల తరపున ఏనాడు ఉద్యమాలు, పోరాటాలు చేశాడా అని ప్రశ్నించారు. తమ ఎంపీ అభ్యర్థి ఎవరో ఆ పార్టీ కార్యకర్తలకే తెలియదని ఎద్దేవా చేశారు. ఆయనకు భారీగా డబ్బులు ఉన్నాయని డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడని ఆ డబ్బుతోనే గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఈ ప్రాంతానికి ఏం చేయకున్నా అన్ని నేనే చేశానని చెప్పుకుంటున్నాడని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతానికి ఓ మంత్రి ఉన్నాడని ఆయన భాష, వ్యవహార శైలి చూసి అందరూ నవ్వుకుంటున్నారని గతంలో ఆయనకు ఇక్కడ డిపాజిట్లు కూడా రాలేదని సెటైర్లు వేశారు.

మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే సోదరుడు మాదిగ సమాజాన్ని హీనంగా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. సమాజంలో అనేక బాధలు ఎదుర్కొంటున్నది మాదిగలేనని ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో మంది మాదిగలు బలిదానమయ్యారని అలాంటి మాదిగ సమాజంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సోదరుడు అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని సదరు ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలని లేకుండా కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులను మాదిగ సమాజాం ఊర్లలో తిరిగనివ్వబోమని హెచ్చరించారు. ఏ వర్గానికి చెందిన వారైనా పేదల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలని ఇది సరైన పద్దతి కాదన్నారు. రాజకీయాల్లో పోరాటం చేయాలే తప్పా ఇలా కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ విషయంలో మాదిగలు ఆలోచన చేయాలన్నారు.

Tags:    

Similar News