Sama Rammohan Reddy: కాంగ్రెస్ సహనాన్ని పరీక్షించొద్దు.. కేటీఆర్ పై సామ ఫైర్

బీఆర్ఎస్ వైఖరి నచ్చకే ప్రజలు మిమ్మల్ని డకౌట్ చేశారని టీ కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు.

Update: 2024-09-14 11:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రాన్ని డెకాయిట్ ల మాదిరిగా కొల్లగొట్టిన బీఆర్ఎస్ చీకటి చరిత్ర నచ్చకనే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించారని, అయినా  బుద్ది మార్చుకోకుండా పేట్రేగుతుంటే పార్లమెంట్ ఎన్నికల్లో డకౌట్ చేశారని టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల సహనాన్ని పరీక్షిస్తే రాబోయే రోజుల్లో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అవుతారని సెటైర్ వేశారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ అసమర్థుడు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. గత సీఎం కేసీఆర్ అసమర్థత వల్లే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, ప్రతిపక్ష నాయకుడిగా కూడా కేసీఆర్ అసమర్థుడిగా మారారని దుయ్యబట్టారు. టూరిస్టులా అమెరికా నుంచి వచ్చిన కేటీఆర్ వచ్చి రాగానే వరద బాధితులను పరామర్శించకుండా ఆంధ్రా ప్రజలను అవమానించిన పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాలను, విషప్రచారాలను నమ్ముకుని ముందుకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. మా నాయకుల సహనాన్ని పరీక్షించవద్దన్నారు. దేనికైనా ఓ హద్దు ఉంటుందని హెచ్చరించారు.

కల్వకుంట్ల కుటుంబం ట్రాప్ లో పడకండి..

ఎన్నికలకు ముందు బేసిన్లు లేవు బేషజాలు లేవని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం దూరం కాగానే ఆంధ్రోళ్లు. బతకడానికి వచ్చినవాళ్లు అంటూ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ కుటుంబం ఇటు తెలంగాణ సమాజానికి పనికి రాలేదని, అటు ఆంధ్రా వారికి మర్యాద ఇవ్వలేదని విమర్శించారు. బదిపోట్ల ముఠా దోచుకుపోయినట్లుగా ఈ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం పదేళ్లు దోచుకుందన్నారు. ఇది చాలదన్నట్లు ఇవాళ విధ్వంసపు రాజకీయాలకు తెరలేపారని ఫైర్ అయ్యారు. మీ కుట్రను ఈ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తీసుకునేలా ఇది వరకే ఆదేశాలిచ్చారని గుర్తు చేశారు. కల్వకుంట్ల కుటుంబం తమ స్వార్థం కోసం తన, పర బేధం చూడరని సొంత వారిని సైతం మోసం చేస్తారని ఈ విషయం తెలంగాణ సమాజం గమనించాలన్నారు. ఆంధ్ర, తెలంగాణ అనే బేధం చూడరని అవకాశ రాజకీయాల కోసం ఎంతకైన దిగజారుతారన్నారు.

వీళ్ల ట్రాప్ లో తెలంగాణ సమాజం పడవద్దని కోరారు. విద్యా, ఉపాధి, ఉద్యోగాలు, అభివృద్ధి, సంక్షేమం కావాలో.. విధ్వంసం, విషప్రచారం కావాలో తెలంగాణ సమాజం, రాష్ట్ర యువత తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ మీరు నిజంగానే హైదరాబాద్ లో ఉంటున్న అన్ని రాష్ట్ర ప్రజలను గౌరవించే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడివే అయితే వెంటనే పాడి కౌశిక్ రెడ్డిని, అతడికి మద్దతు తెలుపుతున్న కేటీఆర్, హరీశ్ రావును పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.


Similar News