‘దమ్ముంటే అమర వీరుల స్థూపం వద్దకు చర్చకు రండి’.. కేటీఆర్, మహేశ్వర్ రెడ్డికి సామా సవాల్

రాష్ట్రంలో సన్నబియ్యం కొన్నట్లు ఆధారం ఉంటే వెంటనే చూపించాలని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి

Update: 2024-05-27 15:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సన్నబియ్యం కొన్నట్లు ఆధారం ఉంటే వెంటనే చూపించాలని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనలేదన్నారు. దమ్ముంటే అమర వీరుల స్థూపం వద్దకు చర్చకు రావాలని ఆయన మాజీ మంత్రి కేటీఆర్, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి సవాల్ విసిరారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మీద బట్ట కాల్చి మీదేస్తే బీజేపీ, బీఆర్ఎస్‌లకే నష్టమన్నారు. సన్నబియ్యం కొనుగోలులో రూ.11 వందల కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్, రూ. 600 కోట్లు జరిగిందని బీజేపీలు ప్రభుత్వాన్ని బద్నం చేసే కుట్రకు తెర లేపాయన్నారు. అర్ధరహిత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పది ఏండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్నడూ సన్న బియ్యం ఇవ్వలేదన్నారు. హాస్టళ్లు, రేషన్ షాపులకు ఇవ్వలేదన్నారు. కానీ మధ్యాహ్నం భోజనంతో పాటు అన్ని కళాశాలలో సన్న బియ్యంతో భోజనం పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

అందుకే ప్రభుత్వం తరపున బోనస్ ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నామన్నారు. గతంలో మాజీ మంత్రి కేటీఆర్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తక్కువ రేట్ 1700 కోడ్ చేస్తూ కొనుగోలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి క్యాబినెట్లో గత బీఆర్ ఎస్ ప్రభుత్వం క్వింటాలు వడ్లని రూ .1700 రూపాయలకే అమ్మకానికి చేసిన టెండర్లను తాము మొదటి క్యాబినెట్‌లో క్యాన్సల్ చేస్తూ, కొత్త టెండర్లను తీసుకువచ్చామన్నారు. అప్పుడు సగటున క్వింటాలుకి రెండు వేల పైచిలుకు ధరతో కాంగ్రెస్ పార్టీ ఆ వడ్లని అమ్మిందనీ, దాని ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.1100 కోట్ల పై చిలుకు రాబడి పెంచడం జరిగిందన్నారు. ఇక రాష్ట్రంలో రేషన్ షాపుల్లో, మధ్యాహ్న భోజనానికి, రెసిడెన్షియల్ కళాశాలలకి అవసరమైన 25 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్తగా టెండర్లను పిలిచామన్నారు.

ధర ఎక్కువ కోట్ చేసిన నేపథ్యంలో టెండర్లని ఎవరికీ ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ టెండర్ల ద్వారా ఇప్పటివరకు ఒక్క గింజ సన్న బియ్యం కొనలేదన్నారు. ఇక మార్కెట్లో 35 రూపాయలకే సన్న బియ్యం ఉన్నాయంటూ కేటీఆర్ మహేశ్వర్ రెడ్డి చెబుతున్నారని, తాము 38 రూపాయలకి కొనుగోలు చేసేందుకు రెడీగా ఉన్నామని సామా వివరించారు. రాష్ట్ర అవసరాల నిమిత్తం 25 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం అవసరం అవుతుందని, ఆ మేరకు కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని క్లారిటీ ఇచ్చారు. ఆ ధాన్యాన్ని మొబిలైజ్ చేసి ప్రభుత్వానికి వివరాలు ఇచ్చేందుకు కేటీఆర్, మహేశ్వర్ రెడ్డి రెడీగా ఉండాలని సవాల్ విసిరారు. లేకుంటే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలని మండిపడ్డారు.

బీజేపీ, బీఆర్ఎస్ చేసిన తప్పుడు పనులు కాంగ్రెస్ చేయదని నొక్కి చెప్పారు. అలాంటి ప్రయత్నాలకు పాల్పడితే తమ ప్రభుత్వంపై ఊరుకోదని హెచ్చరించారు. అబద్ధాలతో బజారుకెక్కితే, నిజాలతో ఏకి పారేస్తామ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కిషన్ రెడ్డి కంటే గొప్పోడిని కావాలని మహేశ్వర్ రెడ్డి ట్రై చేస్తున్నాడన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ తప్పుని ఒప్పుకొని ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఉన్నదన్నారు. లేకుంటే ప్రజలే తరిమికొడతారన్నారు. సివిల్ సప్లై శాఖలో ఎలాంటి అవినీతి లేదన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికే పాన్ , గుట్కా, వంటివి బ్యాన్‌తో పాటు డ్రగ్స్‌పై ఉక్కుపాదం చూపేందుకు యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసిందన్నారు. ఫేక్ ప్రచారాలను ఇప్పటికైనా బంద్ పెట్టుకుంటే బెటర్ అంటూ ఆయన సూచించారు.


Similar News