Rythu Runamafi : రైతులకు గుడ్ న్యూస్.. నేడు రెండో విడత రుణమాఫీ

రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ ప్రక్రియను దశల వారీగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

Update: 2024-07-30 01:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ ప్రక్రియను దశల వారీగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇదివరకే మొదటి విడతగా ఈ నెల 19న లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు. ఇక రెండో విడతలో లక్షన్నర వరకు ఉన్న రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిన తేదీల ప్రకారమే ముందుకెళ్తోంది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ ఆవరణలో రుణమాఫీ రెండో విడత కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రెండో విడతలో సుమారు ఏడు లక్షల మంది రైతులకు దాదాపు ఏడు వేల కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేసింది. అనంతరం రైతు రుణమాఫీపై అసెంబ్లీలో చర్చ పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు స్పీకర్‌కు చర్చకు సంబంధించిన తీర్మానాన్ని ఇవ్వనున్నట్లు తెలిసింది.

మొదటి విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం విధితమే. మొదటి విడతలో రూ.6,098 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీని ద్వారా 11.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. రెండో విడతలో భాగంగా రూ.లక్షన్నర రుణమాఫీని ఈ నెలాఖరులోపు చేస్తామన్న సీఎం అనుకున్న సమయానికి అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. రైతుల రుణమాఫీ కోసం మొత్తంగా రూ.31 వేల కోట్లను ఖర్చు చేయనున్నారు. కాగా, మొదటి విడతలో 17, 877 మంది రైతుల ఖాతాల్లో రూ.84.94 కోట్లు జమ కాలేదని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

ఆగస్టు 14 తర్వాతే రూ.2 లక్షల మాఫీ

రూ.2 లక్షల వరకు రుణాల మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్‌డేట్ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల్లోపు పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సభలో తెలిపారు. కేవలం పాస్‌బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఆగస్టు 2 నుంచి 14 వరకు తాను విదేశీ పర్యటను వెళ్తున్నానని తిరిగి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ ప్రారంభిస్తామని చెప్పారు. ఈ లెక్కన ఆగస్టు 14 తర్వాతే రూ.2లక్షల రుణమాఫీ ఉంటుందని సమా చారం. అయితే ఆగస్టు15 నాటికి రుణమాఫీ మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు.

కాగా, రుణమాఫీ 2018లో అవలంబించిన విధానాలే 2024లో కూడా అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. 2018లో రూ.20 వేల కోట్లు ప్రకటించగా, 2023లో రూ.13 వేల కోట్లు మాత్రమే విడుదల చేశారని, అందులో రూ.1400 కోట్లు వెనక్కి వచ్చినా కనీస స్పందన లేని ప్రబుద్ధులు ఈ రోజు మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని తుమ్మల మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే, ఏక కాలంలో రెండు లక్షల రుణ మాఫీ చేస్తుంటే హర్షించాల్సిన మాజీ మంత్రులు మా మీద బురద చల్లడానికి ప్రయత్నించడంపై రైతాం గం అసహ్యించుకుంటోందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిని దివాళా తీయించిన గత ప్రభుత్వ పెద్దలు, తమ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఓకేసారి రుణమాఫీ చేస్తేంటే ఓర్వలేక రైతాంగం పట్ల కపట ప్రేమ ఒలకబోస్తూ ప్రజా ప్రభుత్వం మీద విషం కక్కుతున్నారని తుమ్మల మండిపడ్డారు.

Tags:    

Similar News