తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రష్యా ఆసక్తి : మంత్రి శ్రీధర్ బాబు
పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించిన రష్యా ప్రభుత్వ ప్రతినిధులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించిన రష్యా ప్రభుత్వ ప్రతినిధులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంగళవారం అసెంబ్లీ సమావేశ మందిరంలో రష్యా ప్రభుత్వ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామికవేత్తలకు కల్పిస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి వివరించారు. గ్లోబల్ కేపిటల్ ఆఫ్ ఏఐ గా తెలంగాణను తీర్చి దిద్దేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా 200 ఎకరాల్లో ఏఐ సిటీ ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టులో రష్యా కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చొరవ చూపాలని ప్రతినిధులను కోరారు. ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ప్రపంచ స్థాయి నిపుణులను తయారు చేసేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల్లో అధిక శాతం తెలంగాణలో తమ కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నాయన్నారు.
జీసీసీలకు హబ్, వ్యాక్సీన్ కేపిటల్‌గా హైదరాబాద్ మారిందన్నారు. యూఎస్ తర్వాత అతిపెద్ద జీసీసీని అమ్జెన్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం తమకు గర్వకారణమన్నారు. టీ హబ్, టీ వర్క్స్ వంటి సంస్థల ద్వారా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఐటీ, ఇన్నోవేషన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇతర అంశాల్లో రష్యా ప్రభుత్వం తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పౌర సేవలను ప్రజల ముంగిటకు చేర్చేందుకు రష్యాలో అమలవుతున్న ఉత్తమ పద్దతులపై అధ్యయనం చేస్తామన్నారు. ఈ సమావేశంలో రష్యా ప్రభుత్వ ప్రతినిధులు లిడ్‌మిలా ఒగారోడోవా, డిమిత్రీ స్టారోస్టిన్, రామిల్ ఖిస్మాటుల్లిన్, వెరా ప్రోంకినా, టీజీ ఐఐసీ ఎండీ విష్ణువర్థన్‌రెడ్డి, టీజీఐఐసీ సీఈవో మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.