హైదరాబాద్‌ శివారులో చదువుకుంటోన్న విద్యార్థులకు శుభవార్త

హైదరాబాద్‌ శివారు ప్రాంతాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

Update: 2023-02-26 12:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ శివారు ప్రాంతాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. విద్యార్థులను క్షేమంగా విద్యాసంస్థలకు చేర్చేందుకు 100 అదనపు ట్రిప్పులను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. విద్యార్థులకు బస్సుల ఏర్పాటుపై గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ అధికారులతో హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో ఆయన ఆదివారం సమావేశం నిర్వహించారు. శివారు ప్రాంతాల్లోని విద్యార్థుల రద్దీ, ఏర్పాటు చేస్తోన్న బస్సుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సామాజిక బాధ్యతగా విద్యార్థులను క్షేమంగా విద్యా సంస్థలకు చేర్చేందుకు టీఎస్‌ఆర్టీసీ కట్టుబడి ఉన్నదని వివరించారు. ఈ సందర్భంగా సజ్జనార్​మాట్లాడుతూ.. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోని కాలేజీలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.

శివారు ప్రాంతాలను 12 కారిడార్‌లుగా విభజించి 350 వరకు బస్సులను నడుపుతున్నామన్నారు. ఇబ్రహీంపట్నం క్లస్టర్‌లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉందనే విషయం సంస్థ దృష్టికి వచ్చిందన్నారు. ఆ కారిడార్‌లోని కాలేజీలకు దాదాపు 44 వేల మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారని, వారిలో 3వ వంతు బస్‌పాస్‌లు తీసుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారన్నారు. అందుకు అనుగుణంగా గత వారంరోజులుగా 8 ట్రిప్పులను అదనంగా నడుపుతున్నామన్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే మరిన్నీ బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రద్దీ దృష్ట్యా ఇబ్రహీంపట్నం కారిడార్‌లో 30 అదనపు ట్రిప్పులను నడపనున్నట్లు చెప్పారు. దీంతో పాటు హైదరాబాద్‌లో ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి 500 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయన్నారు.

విద్యార్థినులకు స్పెషల్ ​బస్సులు

విద్యార్థినుల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. త్వరలోనే విద్యార్థినులకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. గ్రేటర్​హైదరాబాద్​పరిధిలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానం చేస్తూ విద్యార్థినులకు స్పెషల్​బస్సులను తిప్పుతామని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) పీవీ ముని శేఖర్‌, సీపీఎం కృష్ణకాంత్‌, సీటీఎం జీవనప్రసాద్‌, చీఫ్‌ ఇంజినీర్‌ ఐటీ రాజశేఖర్‌, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ఆర్‌ఎంలు వరప్రసాద్‌, వెంకన్న, తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News