కొన్నేళ్ల నుంచి కోరుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: ఆర్టీసీ చైర్మన్
ఆర్టీసీకి బడ్జెట్‌లో 2 శాతం నిధులు కేటాయించాలని టీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్రాజిరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీకి బడ్జెట్‌లో 2 శాతం నిధులు కేటాయించాలని టీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత కొన్ని ఏళ్ల నుంచి కోరుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దీంతో ఈ నెల 7న డిమాండ్స్‌డే సందర్భంగా నిరసనలు తెలపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అన్ని బస్‌డిపోలు, కార్యాలయాలు ముట్టడిస్తామన్నారు. మునుగోడు బై పోల్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణలు చేస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు చేయకపోవడం దారుణమన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు రెండు వేతన సవరణలు చేయవలసి ఉండగా, కనీసం ఒక్కటి కూడా అమలు చేయకపోవడం దారుణమన్నారు.
దీంతో ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు స్పష్టం చేశారు. వేతన సవరణ చేయడానికి మునుగోడు బై ఎలక్షన్స్ కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని లెటల్ రాసినా ప్రభుత్వం.. కోడ్ ముగిసిన 70 రోజులైన తర్వాత కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఇలా జాప్యం చేయడాన్ని జేఏసీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. మరోవైపు ఆర్టీసీలో వెల్ ఫేర్ కమీటీలను రద్దు చేసి యూనియన్లకు అనుమతిస్తూ తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలన్నారు. సీసీఎస్‌కు చెల్లించాల్సిన డబ్బులు, పీఎఫ్, ఎస్ఆర్ బీఎస్‌కు చెల్లించాల్సిన బకాయిలు కూడా ఇవ్వాలని కోరారు. కార్మికులపై పనిభారం తగ్గిస్తూ వేధింపులు ఆపాలని కోరారు.
READ MORE