RTA Commission: త్వరలో ఆర్టీఐ కమిషన్..! చీఫ్ కమిషనర్, కమిషనర్ల నియామకం

ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Update: 2024-09-13 02:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా అర్హులైన దరఖాస్తులను స్క్రూటిని చేసేందుకు ముగ్గురు ఆఫీసర్లతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో చైర్మన్‌గా చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సభ్యులుగా ఆర్అండ్బీ స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏకే దత్తా వ్యవహరించనున్నారు. చీఫ్ కమిషనర్, కమిషనర్ పోస్టుల కోసం సుమారు 700 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కమిటీ 1:3 చొప్పున మొత్తం 21 అప్లికేషన్లను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా అందులో నుంచి చీఫ్ కమిషనర్, ఆరుగురు కమిషనర్ల పేర్లను ప్రతిపాదిస్తూ.. అపాయింట్ చేసేందుకు సర్కారు గవర్నర్‌కు రికమెండ్ చేయనుంది.

మీటింగ్‌కు కేసీఆర్ వచ్చేనా?

ఆర్టీఐ చీఫ్ కమిషనర్, కమిషనర్ ఎంపిక కమిటీలో చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి, మెంబర్లుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఉన్నారు. ఈ ముగ్గురు సమావేశమై స్క్రూట్నీ చేసిన దరఖాస్తుల్లో ఏడుగురిని ఎంపిక చేస్తారు. అయితే ఆ సమావేశానికి కేసీఆర్ వస్తారా? లేదా? అనే చర్చ జరుగుతున్నది. ఎందుకంటే ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మినహాయించి ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. అలాగే రాజ్ భవన్ లో జరిగిన సమావేశాలు, తేనీటి విందులకూ దూరంగా ఉన్నారు. దీంతో ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక సమావేశానికి రావడం కష్టమేననే అభిప్రాయాలు బీఆర్‌‌ఎస్ వర్గాల్లో ఉన్నాయి. ఒకవేళ కేసీఆర్ సమావేశానికి వస్తే, ఆయన ప్రపోజల్స్ కు కూడా ప్రయారిటీ ఉంటుందని, లేకపోతే గైర్హాజరు అయ్యారని మినిట్స్ లో పేర్కొని ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని ఓ రిటైర్డ్ ఐఏఎస్ అభిప్రాయపడ్డారు.


Similar News