Bandi Sanjay: 'ఏకలవ్య' విద్యార్థులకు మెరుగైన శిక్షణ: బండి సంజయ్
ఏకలవ్య పాఠశాల్లో సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య పాఠశాలలను మెరుగైన సౌకర్యాలతో మార్పులు చేసే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గురువారం సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్ల ఏకలవ్య పాఠశాలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆదివాసి, గిరిజన బిడ్డలు అడవికే పరిమితం కాకుండా చదువుల్లో మిగతా వారి పిల్లలతో సమానంగా పోటీ పడుతూ ఉన్నత చదువులు చదివేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి ఎంపీ తమ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏకలవ్య పాఠశాలలను సందర్శించాలనే ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతో తాను ఇవాళ ఈ పాఠశాలను సందర్శించానన్నారు. తన నియోజకవర్గంలో ఈ మర్రిమడ్ల పాఠశాలతో పాటు ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో మరో ఏకలవ్య పాఠశాల ఉందన్నారు. వీటిని సందర్శించి ఇక్కడ విద్యార్థులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నాన్నారు. అవసరమైన సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తానన్నారు. తెలంగాణలో 23 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయని ఇక్కడి పిల్లల్లోని నైపుణ్యాన్ని గుర్తించి వారికి శిక్షణ ఇప్పిస్తామన్నారు. గిరిజన బిడ్డల చదువుకు పేదరికం ఆడ్డంకిగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు.