సీఎం కేసీఆర్ ఆ నినాదం వెనుక భారీ మోసం: RS ప్రవీణ్ కుమార్
తెలంగాణ ప్రజల ముందు బీజేపీకి, మోడీ అమిత్ షాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతున్నట్లు డ్రామాలు చేస్తూ, తెరవెనక దోస్తీ చేస్తున్నారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రజల ముందు బీజేపీకి, మోడీ అమిత్ షాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతున్నట్లు డ్రామాలు చేస్తూ, తెరవెనక దోస్తీ చేస్తున్నారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. సీఎం కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా, మోడీ అమిత్ షాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారనేది శుద్ధ అబద్ధం అని, వారి మధ్య బలమైన బంధం ఉన్నదని ఆరోపించారు. ఈ మేరకు ఆర్ఎస్పీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అమిత్ షా కేంద్రంలో సహకార శాఖ మంత్రి కూడా అవుతారని, అమిత్ షా ఆదేశాలతో గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ అనే పాల కంపెనీని తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ఐటీశాఖ మంత్రి ఆమోదం తెలిపారని, ఈ విషయం ఇతర తలసాని వంటి వారికి తెలియదని సెటైర్లతో తీవ్రంగా విమర్శించారు.
ఇదే కంపెనీని కర్ణాటకలో ఏర్పాటు చేసి ఆ రాష్ట్రంలో ఉన్న నందిని అనే పాల కంపెనీని మూసియాలని చూస్తే అక్కడి ప్రజలు తిరగబడి అమూల్ కంపెనీని రానివ్వలేదని తెలిపారు. తెలంగాణలో మాత్రం సీఎం తన సొంత నియోజకవర్గం అయిన గజ్వేల్‌లోని వర్గల్‌లో అమూల్ కంపెనీ ఏర్పాటు చేయడానికి ఎర్రతివాచీ పరిచి ఆహ్వానించారన్నారు. తెలంగాణ రాష్ట్ర పాడి రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసినా పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణకు చెందిన విజయ పాల కంపెనీకి ప్రభుత్వం గత రెండేళ్లుగా కనీసం ఎండీని కూడా ఎందుకు నియమించలేదని నిలదీశారు. రావిర్యాల ఫ్యాక్టరీకి ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించడం లేదన్నారు.
కేంద్రంలో బీజేపీ రిలయన్స్ కంపెనీ లాభాల కోసం బీఎస్ఎన్ఎల్ కంపెనీని చంపినట్లే, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో విజయ డెయిరీ వంటి స్థానిక కంపెనీలను చంపి, అమూల్ కంపెనీని తెస్తున్నారని మండిపడ్డారు. తన కూతురు కవితను ఈడీ విచారణ నుంచి కాపాడడానికే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారని పేర్కొన్నారు. కిసాన్ సర్కార్ అంటే రాష్ట్రంలోని పాడి రైతుల పొట్టకొట్టడమేనా అని ప్రశ్నించారు. కిసాన్ సర్కార్ నినాదం రైతులను మోసం చేయడానికేనని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలో ఒక యువతిపై ఎస్ఐ దాడి చేయడాన్ని తప్పుబట్టారు. షీ టీమ్స్ మహిళా పోలీసులు ఎక్కడ పోయారని, పోలీసులే ఇలా మహిళల పట్ల వివక్ష చూపుతే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటన్నారు. కేసీఆర్ పాలనలో పోలీసులు మహిళల కిచ్చే గౌరవం ఇదేనా అని విమర్శించారు.