ROR act 2024: గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ పక్కా!

గత ప్రభుత్వం రెవెన్యూ పాలనను అస్తవ్యస్తం చేసింది. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలకు ఆల్టర్నేట్ లేకుండా చేసింది. ప్రతి సమస్యకు హైదరాబాద్ కే వచ్చేట్లు చేసింది.

Update: 2024-08-10 10:28 GMT

ఆర్వోఆర్ 2024 డ్రాఫ్ట్..

గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ పక్కా!

 అమలు చేయాలంటే ఉండాల్సిందే

విచారణ, రిపోర్టులే కాదు

రెవెన్యూ విలేజ్ అకౌంట్ నిర్వహణ

భూదార్ నంబర్లకు స్టాఫ్ మస్ట్

ప్రతి ఊరికో ఉద్యోగి తప్పనిసరి

దిశ, తెలంగాణ బ్యూరో:

గత ప్రభుత్వం రెవెన్యూ పాలనను అస్తవ్యస్తం చేసింది. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలకు ఆల్టర్నేట్ లేకుండా చేసింది. ప్రతి సమస్యకు హైదరాబాద్ కే వచ్చేట్లు చేసింది. కనీసం కుల, ఆదాయ, వారసత్వ ధృవ పత్రాల విచారణ, సంక్షేమ పథకాల అర్హుల జాబితాను రూపొందించేందుకు గ్రామ స్థాయిలో ఓ ఉద్యోగిని లేకుండా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థకు రూపకల్పన చేస్తున్నది. రైతాంగానికి సత్వర సేవలందించాలంటే గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ అనివార్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటించారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవ‌స్థకు సంబంధించిన ఓ ఉద్యోగి ఉండేటట్లు చూస్తామన్నారు. ఐతే గతంలో మాదిరిగా వీఆర్వో వ్యవస్థకు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. వీఆర్వోకు బదులుగా జూనియర్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ లేదా మరే ఇతర పేరుతోనో రూపొందించే చాన్స్ కనిపిస్తున్నది. ఆర్వోఆర్ చట్టం 2024 ముసాయిదాలోనూ గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ అనివార్యంగా చూపించారు. చాలా అంశాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన, దర్యాప్తు, విచారణ వంటి పదాలను జోడించారు. ఇవన్నీ సమర్ధవంతంగా నిర్వర్తించాలంటే ఎవరో ఒకరు ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నది. అన్నింటికి మించి చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం గ్రామ రెవెన్యూ(విలేజ్ అకౌంట్) రికార్డుల నిర్వహణ బాధ్యతలను గతంలో వీఆర్వోలే నిర్వహించే వారు. ఇప్పుడది తప్పనిసరిగా పేర్కొనడంతో అదే స్థాయి ఉద్యోగి ఊరికి రానున్నారు.

తప్పని నియామకం

రాష్ట్రంలో భూ సమస్యలు పెరుగుతున్నాయి. ఇప్పటికీ లక్షల్లో అప్లికేషన్లు పెండింగులో ఉన్నాయి. ఏ ఒక్కరి దరఖాస్తు కూడా నిర్దేశించిన గడువులోగా పరిష్కరించిన దాఖలాలు లేవు. ఒకవేళ తిరస్కరించి ఉండొచ్చు. కానీ రైతు సమస్యకు పరిష్కారం మాత్రం చూపలేదు. ఒక్కో అప్లికేషన్ కి రికార్డులను వెరిఫై చేసి రిపోర్ట్ రాయాలంటే కనీసం మూడు, నాలుగు గంటలు పడుతున్నది. రెవెన్యూ ఇన్ స్పెక్టర్, డిప్యూటీ తహశీల్దార్లు ఈ పనిని చేయాలంటే రోజుకు రెండు లేదా మూడు కంటే ఎక్కువ దరఖాస్తులను పరిశీలించలేరు. అందుకే రిజెక్షన్ అప్లికేషన్ల సంఖ్యనే 75 శాతం వరకు ఉన్నాయి. ఒక్కో సమస్య పరిష్కారానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. ఇదిలాగే కొనసాగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయం నెలకొన్నది. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలన్నీ గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారానే మేలు కలుగుతుందని ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు.

అవసరం ఎందుకు?

ఆర్వోఆర్ యాక్ట్ 2024 ముసాయిదా ప్రకారం తాత్కాలిక భూదార్, శాశ్వత భూదార్, భూదార్ కార్డుల జారీ, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, దరఖాస్తుల పరిశీలన, వీలునామా, వారసత్వ విషయంలో మ్యుటేషన్ లో విచారణ, సెక్షన్ 13 ప్రకారం గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, నిర్ణయించిన రీతిలో హక్కుల రికార్డుల తుది ప్రచురణ తర్వాత అమలు చేయాలి. ధరణి పోర్టల్ లో తప్పొప్పుల సవరణతో పాటు అసలే నమోదు కాకుండా పార్టు బి కింద పేర్కొన్న సుమారు 18 లక్షల ఎకరాల డేటాను పరిశీలించి ఆ రైతులకు న్యాయం చేయాల్సి ఉంది. ప్రభుత్వం పార్టు బి కింద పేర్కొన్న వాటిని ఏబీసీడీ వర్గీకరణ చేయాలని నిర్ణయించింది. ఆ భూ సమస్యల స్థితి, స్థాయిని బట్టి ఎవరు పరిష్కరించాలనే దానికి త్వరలోనే గైడ్ లైన్స్ రూపొందించనున్నదని విశ్వసనీయంగా తెలిసింది. కోర్టు కేసులు మినహా మిగతా భూముల డేటాను పరిశీలించేందుకు కసరత్తు చేస్తున్నది. ఇలాంటి అనేకాంశాల్లో గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది అనివార్యంగా మారుతున్నది.

వీఆర్వో వ్యవస్థ కాదు

కొందరు వీఆర్వోలు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆ వ్యవస్థనే రద్దు చేశారు. వారందరినీ ఇతర శాఖలకు ఆగమేఘాల మీద, లాటరీ పద్ధతిన పంపారు. వారిలో సగానికి పైగా ఉద్యోగులు ఇమడలేకపోతున్నారు. కొందరు దీర్ఘకాలిక సెలవు పెట్టారు. తిరిగి వ్యవస్థను పునరుద్ధరించాలంటూ ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఇంకొందరేమో సర్వీస్ మ్యాటర్ ని ఫైనల్ చేయండంటూ వేడుకున్నారు. గిరిజన కార్పొరేషన్ కి బదిలీ చేసిన 16 మంది ఉద్యోగులకు 20 నెలలుగా వేతనాలు రాలేదు. వారేమో తాము ఉద్యోగులామా? కాదా? అంటూ అందరినీ కలుస్తున్నారు. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థల రద్దు తర్వాత ప్రత్యామ్నాయాలు, తలెత్తే సమస్యలను గుర్తించకుండా కేసీఆర్ సర్కార్ చేసిన కుంపటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. వేలాది మంది ఉద్యోగులను ఉన్నపళంగా ఇతర శాఖల్లోకి డెప్లాయ్ చేయడం ద్వారా ఎన్ని సమస్యలొస్తాయన్న విషయాన్ని ఉన్నతాధికారులు మాజీ సీఎం కేసీఆర్ కి చెప్పలేదు. ఇప్పుడా రద్దయిన వ్యవస్థల పునరుద్ధరణ కూడా సాధ్యమయ్యేటట్లు లేదు. కానీ గ్రామీణ రెవెన్యూ నిర్వహణకు మాత్రం ఉద్యోగులు అవసరం మాత్రం ఏర్పడింది. ఎవరిని తీసుకుంటారన్న అంశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వీఆర్వోల వరకేనా? అందరిని తీసుకుంటారా? అన్న విషయంలో స్పష్టత రాలేదు.


Similar News