ఘోర రోడ్డు ప్రమాదం.. దైవ దర్శనానికి వెళ్తూ అనంత లోకాలకు:

ఖమ్మం జిల్లాలోని కొణిజర్లలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలతో సహా వారి కుమారుడు దుర్మరణం చెందారు.

Update: 2023-06-01 04:58 GMT

దిశ, వైరా: ఖమ్మం జిల్లాలోని కొణిజర్లలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలతో సహా వారి కుమారుడు దుర్మరణం చెందారు. మరో కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో వైరా మండలంలోని విప్పలమడక గ్రామానికి చెందిన పారుపల్లి రాజేష్(36), అతని భార్య(34) సుజాత చిన్న కుమారుడు అశ్విత్ (13) అక్కడ అక్కడే మృతిచెందారు. రాజేష్ సుజాత, దంపతుల మరో కుమారుడు దివ్యజిత్ పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో ఉన్న లారెస్ ఫార్మసీ కంపెనీలో రాజేష్ అకౌంటు విభాగంలో ఉద్యోగిగా పని చేస్తున్నారు. అయితే రాజేష్ కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లేందుకు తన సొంత గ్రామం వైరా మండలంలోని విప్పలమడకకు గురువారం రాత్రి హైదరాబాద్ ప్రగతి నగర్ నుంచి తమ సొంత కారులో బయలుదేరాడు . అయితే వీరు ప్రయాణిస్తున్న కారు కొణిజర్లలో ఘోర రోడ్డు ప్రమాదంకు గురైంది .

కొణిజర్లలోని ప్రధాన సెంటర్ కు సమీపంలో జాతీయ రహదారిపై ఖమ్మం నుంచి వైరా వస్తు చెడిపోయిన లారీ ట్యాంకర్ ను రోడ్డుపై నిలిపి వేశారు. ఈ ట్యాంకర్ నిలిపిన ప్రదేశంలో వైరా వైపు నుంచి ఎదురుగా వాహనాలు పాస్ అవుతుండటంతో ఖమ్మం నుంచి వైరా వస్తున్న మరో లారీ ఆగిన ట్యాంకర్ వెనుక నిలిచింది. వెనుక వస్తున్న రాజేష్ తన కారును స్లో చేశాడు. అయితే రాజేష్ కారు వెనుక వస్తున్న మరో లారీ కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ముందు, వెనుక రెండు లారీల మధ్య కారు ఇరక్కపోయి నుజ్జు, నుజ్జు అయ్యింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న రాజేష్, సుజాత దంపతులతో పాటు వారి చిన్న కుమారుడు యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దంపతుల పెద్ద కుమారుడు దివ్యజిత్ పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

స్థానికులు, పోలీసులు సుమారు గంటకు పైగా శ్రమించి రెండు లారీల మధ్య ఇరుక్కుపోయిన కారును బయటకు తీశారు. సంఘటన స్థలాన్ని వైరా ఏసీపీ రెహమాన్, సీఐ సురేష్ పరిశీలించారు. దైవ దర్శనానికి వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరి రోడ్డు ప్రమాదంలో.. తమ గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు చనిపోవడంతో విప్పలమడక గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. కొణిజర్ల ఎస్సై శంకర్ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News