ఆలయాలకు పునరుజ్జీవనం.. ప్రభుత్వం భారీగా నిధుల విడుదల

రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ రానున్నది. వాటి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది.

Update: 2024-10-03 02:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ రానున్నది. వాటి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. పలు డెవలప్‌మెంట్ వర్క్స్ కోసం సీజీఎఫ్ నుంచి నిధులు కేటాయిస్తుంది. మొదటి విడతగా రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని ఆలయాల్లో పనులు చేపడుతున్నది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. మరో వైపు టీటీడీ సహకారంతో 159 భజనమండళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

ఆలయాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏయే ఆలయాలు శిథిలావస్థకు చేరాయి.. ఎందులో మౌలిక వసతులు లేవు అనే వివరాలు ఇప్పటికే సేకరించింది. ఇందులో పురాతన ఆలయాలు, ప్రాధాన్యతను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గర్భగుడి, ధ్వజస్తంభం, మండపాలు, ప్రాకార మండపాలు, ప్రముఖ ఆలయాల పరిధిలోని చిన్న(సబ్) టెంపుల్స్ పై దృష్టి సారించారు. కొన్ని చోట్ల ఆలయాల కమిటీల రిక్వెస్టుతో పాటు మంత్రులు సైతం ముందుకు రావడంతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

16 జిల్లాలు.. 36 పనులు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 జిల్లాల్లోని ఆలయాల్లో 36 పనులు చేపడుతున్నారు. వీటి కోసం సీజీఎఫ్(కామన్ గ్రాంట్ ఫండ్) నుంచి రూ.12 కోట్ల 89 లక్షల 5 వేలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆరు పనులు చేపట్టగా, కరీంనగర్‌లో ఐదు పనులు చేపట్టారు. ఆల యాల్లో చేపట్టే ప్రతి పనికీ సుమారు రూ.50 వేలకు మించకుండా ఖర్చు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

13 ఆలయాల్లో పనులకు టెండర్లు

ఆలయాల్లో అభివృద్ధి పనుల నిర్వహణకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తుంది. రూ.5 కోట్ల 57 లక్షల50 వేలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఆదిలాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 13 దేవాలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అక్టోబర్ 14తో బిడ్ ముగుస్తుంది. తక్కువ కోట్ చేసి పనులు చేసేందుకు ముందుకు వస్తారో వారికే వర్క్స్ అప్పగించనున్నట్లు తెలిపారు.

టీటీడీ సహకారంతో 159 భజన మండళ్లు

రాష్ట్రంలోని ఆలయాల్లో విధిగా భజనమండళ్లు ఉండాలనే లక్ష్యంతో టీటీడీ వాటికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపడంతో 159 మండళ్లకు టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్టు నిధులు మంజూరు చేసిందని అధికారులు తెలిపారు. ప్రతి మండపానికీ రూ.10 లక్షలు మంజూరు చేసింది. 17 జిల్లాల్లో మండపాల నిర్మాణం చేపడుతున్నారు. వాటికి ఫేజ్‌ల వారీగా మూడు విడుతల్లో నిధులు విడుదల చేయనున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ మండపాల నిర్మాణం చేపడతామని అధికారులు వివరించారు. ప్రతి రోజూ స్వామివారి భజన కార్యక్రమాలు నిర్వహించేలా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.

వందేళ్ల వరకు చెక్కు చెదరకుండా నిర్మాణాలు

- కొండా సురేఖ, మంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ

దేవాలయాల అభివృద్ధికి ప్రస్తుతం చేపట్టే పనులు మరో వందేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా చేపడుతున్నాం. పనుల పర్యవేక్షణ బాధ్యత సంబం ధిత అధికారులదే. కొన్ని ఆలయాల్లో ప్రాకారం, గోపురాలు, గర్భగుడి పనులు మొదలయ్యాయి. దీర్ఘకాలం మనగిలిగేలా, భక్తులు, పర్యాటకులను ఆకట్టుకునేలా పర్యావరణహిత విధానాలను అనుసరిస్తూ పటిష్టంగా నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించాం. భక్తుల సౌకర్యం నిమిత్తం పార్కింగ్, మూత్రశాలలు, క్యూలైన్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.

భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పనులు

- కృష్ణవేణి, దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్

ఆలయాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం సైతం చొరవ తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 36 ఆలయాల్లో సుమారు రూ.13 కోట్లతో పనులు చేపడుతున్నాం. తాజాగా 9 జిల్లాల్లోని 13 పనులకు టెండర్లు ఆహ్వానించాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం.


Similar News