రెండవ రోజు CWC మీటింగ్‌లో చర్చించే అంశాలు ఇవే.. బయటపెట్టేసిన రేవంత్ రెడ్డి..!
సీడబ్ల్యూసీ సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేయడం తెలంగాణకు ఎంతో కీలకమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: సీడబ్ల్యూసీ సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేయడం తెలంగాణకు ఎంతో కీలకమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కీలకమైన సీడబ్ల్యూసీ మీటింగ్ ఇక్కడ నిర్వహించినందుకు తెలంగాణ కాంగ్రెస్ తరపున జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఆదివారం తాజ్ కృష్ణ హోటల్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలపై నిన్న సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించామని తెలిపారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఇవాళ సమావేశంలో చర్చిస్తామని పేర్కొన్నారు.
ఇక, ఏ లక్ష్యంతో సోనియా తెలంగాణ ఇచ్చారో ఆ లక్ష్యం నెరవేరలేదని.. ఆ లక్ష్యాన్ని, కలను నెరేవేర్చేందుకే ఇవాళ తుక్కుగూడలో విజయభేరి సభ నిర్వహిస్తున్నామన్నారు. సాయంత్రం జరిగే విజయభేరిలో సోనియాగాంధీ గ్యారంటీలను ప్రకటిస్తారని తెలిపారు. తెలంగాణ ఇస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టే.. ఇవాళ విజయభేరిలో ఇవ్వబోయే గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో పథకాలు అన్నీ అమలు చేసేలా గ్యారెంటీ ఇవ్వబోతున్నామని చెప్పారు. సాయంత్రం తుక్కుగూడలో జరిగే విజయభేరి సభకు లక్షలాదిగా తరలిరావాలని ప్రజలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎంఐఎం, బీఆరెస్, బీజేపీ సభలకు లేని ఆంక్షలు కాంగ్రెస్ సభకే ఎందుకని ప్రశ్నించారు. కొంతమంది పోలీసులు బీఆరెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.