జానారెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ.. కేబినెట్‌లో బెర్త్ ఖాయమా?
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా భేటీ అవుతున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా భేటీ అవుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో భేటీ అయ్యారు. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జానారెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎంను జానారెడ్డి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. వీరి మధ్య దాదాపు గంట పాటు వీరి మధ్య చర్చ జరిగింది. ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై వీరు చర్చించినట్లు సమాచారం. కాగా, ఈసారి ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేయలేదు. ఆయన కుమారుడు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అయితే త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి జానారెడ్డితో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న జానారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో హోంశాఖతో పాటు వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో 11 మంది మంత్రులకు చోటు దక్కగా మరో ఆరుగురికి చోటు దక్కబోతున్నది. ఈ నేపథ్యంలో పరిపాలన వ్యవహారాల్లో సుదీర్ఘ అనుభంతో పాటు పార్టీలో సీనియర్ నేతగా ఉన్న జానారెడ్డికి రేవంత్ రెడ్డి కేబినెట్‌లో బెర్త్ ఖన్ఫార్మ్ కాబోతున్నదన్న టాక్ వినిపిస్తోంది.