కేసీఆర్ భయపడ్డారు.. అక్కడ సీఎం ఓటమి ఖాయం: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుండి పోటీ చేస్తానని ప్రకటించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్‌కు తన గెలుపు మీద నమ్మకం లేకనే రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. సిట్టింగ్‌లు అందరి సీట్లు ఇవ్వాలని.. కేసీఆర్ గజ్వేల్‌లో మాత్రమే పోటీ చేయాలని తాము మొదటి నుంచి డిమాండ్ చేశామని కానీ సిట్టింగ్‌లలో మార్పులు చేసి.. కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డికి పారిపోయి పోటీ చేయాలని నిర్ణయించుకుని తన ఓటమిని స్వయంగా అంగీకరించినట్లయిందని ఎద్దేవా చేశారు. ఈ రెండు చోట్ల ఆయన ఓడిపోతారని జోస్యం చెప్పారు. కేసీఆర్ స్వరంలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని.. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా గమనిస్తే కాంగ్రెస్‌దే విజయం అని స్పష్టం అవుతుందన్నారు.
మైనార్టీ నాయకుడు షబ్బీర్ అలీపై కేసీఆర్ పోటీ చేయడం అంటే మైనార్టీల విషయంలో ఆయన వైఖరి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. పారిపోవాలి అనుకుంటే సిద్దిపేట, సిరిసిల్లా నియోజకవర్గాలు ఉన్నాయని కానీ కేసీఆర్ మాత్రం మైనార్టీ నేతపై పోటీకి వస్తున్నారని ధ్వజమెత్తారు. 12.03 గంటలకు బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ విడుదల అని ప్రచారం చేసుకుని ఆ ముహూర్తంలో లిక్కర్ షాప్స్ డ్రా తీశారని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ విషయంలో కేసీఆర్ రెండు సార్లు మోసం చేశాడని విమర్శించారు.
2014 కంటే జరిగిన అన్ని పాపాలకు కేసీఆర్ కారణం అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుంటే కేటీఆర్ అమెరికాకు పారిపోయాడని, ఐఆర్బీ నుంచి వచ్చిన సొమ్ముతో పెట్టుబడి పెట్టేందుకు కేటీఆర్ అమెరికా వెళ్లారని ఆరోపించారు. ప్రభుత్వం పెద్ద ఒప్పందాలు చేసుకున్న ప్రతిసారి కేటీఆర్ విదేశాలకు వెళ్తున్నాడని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో తాను డబ్బు, మద్యం పంచనని కేటీఆర్ చెబుతున్నాడని నిజంగా కేటీఆర్‌కు నమ్మకం ఉంటే బీఆర్ఎస్ అభ్యర్థులంతా మద్యం, డబ్బు పంచమని ప్రమాణం చేయాలని ఛాలెంజ్ చేశారు.
కాంగ్రెస్‌కు చెందిన 119 అభ్యర్థులంతా మద్యం, డబ్బు పంచబోమని ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని.. యాదగిరిగుట్ట, నాంపల్లి దర్గా, మెదక్ చర్చి వీటిలో ఎక్కడ ప్రమాణం చేద్దామో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. నిన్న సూర్యాపేట సభలో శ్రీకాంతచారి తల్లికి కూర్చికూడా వేయకుండా నిల్చోబెట్టి అవమానించారని అమరవీరుల కుటుంబానికి కేసీఆర్ ఇచ్చే గౌరవం ఇదేనా అని మండిపడ్డారు.
మహిళా రిజర్వేషన్ల కోసం కవిత ఢిల్లీలో ధర్నా చేయడం కాదని.. తెలంగాణలో మహిళాలకు టికెట్లు ఇవ్వాలని కేసీఆర్‌ను ప్రశ్నించాలన్నారు. నమ్మించి మోసం చేసిన కేసీఆర్‌పై కమ్యూనిస్టులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇంతలా అవమానిస్తున్నా ఇంకా కమ్యూనిస్టులు బీఆర్ఎస్ చూరు పట్టుకునే వేళాడుతున్నారని అన్నారు.