Big News : పోలీసులకు గుడ్ న్యూస్.. ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ పై ఉత్తర్వులు.. లొకేషన్ ఎక్కడంటే?

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా రేవంత్ సర్కార్ పోలీసులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-10-21 11:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పోలీసుల పిల్లలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పోలీసుల పిల్లల కోసం నాణ్యమైన విద్య అందించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ‘ఇండియా పోలీస్ స్కూల్’ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు అమరవీరులు, ఇతర యూనిఫాం సర్వీస్ డిపార్ట్‌మెంట్‌లకు చెందిన సిబ్బందికి చెందిన పిల్లల కోసం "యంగ్ ఇండియా పోలీస్ స్కూల్" స్థాపనకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోమ్‌శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రవి గుప్త సోమవారం జీవో జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

పోలీస్ అమరుల పిల్లలు, పోలీసులతో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసులైన ఫైర్, ఎక్సైజ్ లాంటి వివిధ రకాల సిబ్బంది బిడ్డలకు పోలీస్ స్కూల్లో అడ్మిషన్లు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ పాఠశాల ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీ చూడాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు. కాగా, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మిస్తామని, వచ్చే ఏడాది 1-5 క్లాసులతో ఈ స్కూల్ ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ డిగ్రీ వరకు నాణ్యమైన విద్యను అందిస్తామని హైదరాబాద్ రాజ్‌బహదూర్ వెంకటరామిరెడ్డి పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకల్లో హామీ ఇచ్చారు.


Similar News