‘నేను భూమి కొనుగోలు చేసినప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే’
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. తవ్వినా కొద్ది ఆయన అవినీతి వ్యవహారాలు బయటకు వస్తున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. తవ్వినా కొద్ది ఆయన అవినీతి వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. 8 రోజుల కస్టడీలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఇష్యూలో మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్‌పైనా ఆరోపణలు వచ్చాయి. తాజాగా.. తనపై వచ్చిన ఆరోపణలపై రజత్ కుమార్ స్పందించారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
2013-2014 లో GAD పర్మిషన్‌తో భూమి కొనుగోలు చేశానని చెప్పారు. తాను భూమి కొనుగోలు చేసినప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీనే ఉందని అన్నారు. అదే భూమిని 2021లో అమ్ముకున్నానని వెల్లడించారు. 2019లో కూడా తనపై ఇలాంటి తప్పుడు ప్రచారమే చేశారని గుర్తుచేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.