ఎంఎస్ఎంఈ పాలసీలో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వేషన్: డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్రం ఏర్పడి పదేండ్లయినా సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ప్రత్యేకమైన పాలసీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫస్ట్ టైమ్ ఈ పాలసీ వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Update: 2024-09-18 16:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం ఏర్పడి పదేండ్లయినా సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ప్రత్యేకమైన పాలసీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫస్ట్ టైమ్ ఈ పాలసీ వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికి ఏర్పాటైన ఎంఎస్ఎంఈ పరిశ్రమల గణాంకాలను పరిశీలిస్తే పారిశ్రామికవేతల్లో దాదాపు 15% మంది ఎస్సీలు, 8.75% మంది ఎస్టీలు, 27.69% మంది ఓబీసీలు ఉన్నారని వివరించారు. ఇప్పుడు కొత్త పాలసీలో సైతం ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించామన్నారు. ప్రస్తుతం అమలవుతున్న టీ-ప్రైడ్ స్కీమ్‌లో యూనిట్ల స్థాపన సమయంలో ల్యాండ్ కాస్ట్ పేరుతో ఎస్సీ, ఎస్టీలకు కలిపి 33% రిజర్వేషన్ అమలవుతున్నదని, గరిష్టంగా రూ. 30 లక్షలను ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తున్నదని, ఇప్పుడు దాన్ని 50%కి పెంచి గరిష్టంగా రూ. 50 లక్షల వరకు ఇస్తుందన్నారు. దీనికి తోడు కాపిటల్ ఇన్వెస్ట్ మెంటు రూపంలో ప్రభుత్వం నుంచి 35% సబ్సిడీతో రూ. 75 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతున్నదని, కొత్త పాలసీ ప్రకారం అది 50%కి పెరిగి గరిష్టంగా కోటి రూపాయలు అందుకోవచ్చన్నారు.

మహిళా పారిశ్రామికవేత్తలను సైతం ప్రోత్సహించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి అదనంగా 10%గా ఉన్న సబ్సిడీని 20%కి పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ రూపంలో గరిష్టంగా అదనంగా రూ. 20 లక్షలను పొందుతారన్నారు. గడచిన పదేండ్లలో ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందకుండా పెండింగ్‌లో పడ్డాయని, త్వరలోనే రూ. 2 వేల కోట్లను దశలవారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలతో రాహుల్‌గాంధీ చర్చలు జరిపారని, వారి నుంచి వచ్చిన అభిప్రాయాలు, ఆలోచనలకు ఇప్పుడు కొత్త పాలసీలో స్థానం లభించిందని డిప్యూటీ సీఎం గుర్తుచేశారు. ఎంఎస్ఎంఈల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్ని అంశాలనూ కొత్త పాలసీలో పొందుపర్చారని, ఆ రంగం అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. దీనికి తోడు ఎంఎస్ఎంఈలకు టేక్ ఓవర్ ప్రమాదం ఉండదన్నారు. కొత్త పాలసీలో సామాజిక న్యాయం ప్రతిబింబించిందన్నారు.

రాష్ట్ర, దేశ జీడీపీ పెరుగుదలలో చిన్న మధ్య తరహా పరిశ్రమల పాత్ర గణనీయంగా ఉన్నదని, వీటిని ప్రోత్సహించడం ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలతో పాటు భారీ స్థాయిలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు ఈ ఏడాది ప్రారంభంలో దావోస్ పర్యటనలో దాదాపు 40 వేల కోట్లకు పైగా వివిధ కంపెనీలతో అవగాహనా ఒప్పందాల (ఎంఓయూ)ను కుదుర్చుకున్నారని గుర్తుచేశారు. ఇటీవల అమెరికా, కొరియా దేశాల పర్యటన సందర్భంగా మరో రూ. 41 వేల కోట్ల విలువైన ఎంఓఏలు కుదిరాయన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం ఆహ్వానించదగిన పరిణామమన్నారు. భారీ పరిశ్రమలకు తోడుగా ఎంఎస్ఎంఈలను కూడా కలుపుతూ రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఈ పాలసీ దోహదపడుతుందన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు హైదరాబాద్ రావడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, డీఆర్‌డీఓ, ఐడీపీఎల్ వంటి భారీ పరిశ్రమలను హైదరాబాదులో నెలకొల్పగా వాటికి అనుసంధానంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలు హైదరాబాదులో పెద్ద ఎత్తున ఆవిర్భవించాయన్నారు. చాలా రాష్ట్రాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడుతున్నాయని, గుజరాత్‌లో 1,626, మహారాష్ట్రలో 5,082, తమిళనాడులో 2,486 మూతపడ్డాయని గుర్తుచేశారు. కానీ తెలంగాణలో మాత్రం 231 పరిశ్రమలు మాత్రమే మూతపడ్డాయన్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులు, మానవ వనరుల లభ్యత తదితరాల కారణంగా ఇక్కడ మంచి అవకాశాలున్నాయన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో పెద్ద కంపెనీలల్లో టేక్ ఓవర్‌లు కనిపిస్తాయిగానీ ఎంఎస్ఎంఈ విషయంలో ఇలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించిందని, దీంతో ఎంఎస్ఎంఈలలో అవసరాలకు తగిన మానవ వనరులు లభిస్తాయన్నారు.


Similar News