KCR మీద కేసు నమోదు చేయండి.. హైకోర్టులో పిటిషన్

బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సెలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Update: 2024-01-25 09:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సెలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టును కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని, నెంబర్ ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించిన సీజే నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. మరో పిటిషన్‌ను అటాచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌తో పాటు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అప్పటి రెవెన్యూ సెక్రటరీ, ఈ వ్యవహారంలో బాధ్యులైన రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. సీజే బెంచ్ గురువారం ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇరు తరఫున వాదనలను విని.. గతంలో వెంకట్రామిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌తో జత చేయనున్నట్లు స్పష్టత ఇచ్చారు.

కోకాపేటలో (సర్వే నెం. 239, 240) బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సెలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ సెంటర్ కోసం 11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ గతేడాది ఒక మెమో (నెం. 12425) లాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి జారీ అయింది. ఈ ఉత్తర్వుల మేరకు రంగారెడ్డి జిల్లా అప్పటి కలెక్టర్ ఒక్కో ఎకరానికి రూ. 3.42 కోట్ల చొప్పున మార్కెట్ విలువ ప్రకారం మొత్తం 11 ఎకరాలకు రూ. 37.53 కోట్ల మేర ధరను ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఈ భూమి ధర మొత్తం రూ. 1100 కోట్ల మేర ఉంటుందని, అతి చౌకకు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టడాన్ని సవాలు చేస్తూ వెంకట్రామిరెడ్డి దాఖలు చేసిన ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. రెండు పిటిషన్లను కలిపి సీజే బెంచ్ విచారించనున్నది.

ఈ పిటిషన్‌పై గతంలోనే విచారణ జరగ్గా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తరఫున హాజరైన న్యాయవాది గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సీసీఎల్‌ఏకు లేఖ రాశామని మే 16న కోర్టుకు వివరించారు. సీసీఎల్ఏ సైతం ఈ భూమి విషయంలో తెలంగాణ స్టేట్ లాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీకి లేఖ రాసిందని, పరిశీలన అనంతరం సానుకూలంగా సిఫారసు చేసిందని గుర్తుచేశారు. ఈ లావాదేవీలకు కొనసాగింపుగా హెచ్ఎండీఏ సైతం 11 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో 2008లో కాంగ్రెస్ పార్టీకి బౌనేపల్లి గ్రామం (తిరుమలగిరి మండలం)లో 10.15 ఎకరాల స్థలాన్ని ఒక్కో ఎకరానికి రూ. 2 లక్షల చొప్పున మంజూరు చేసిన తీరులోనే బీఆర్ఎస్ పార్టీకి ఎక్సెలెన్స్ సెంటర్‌కు 11 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చిన ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్న గత ప్రభుత్వ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో రెండు పిటిషన్లను కలిపి హైకోర్టు విచారించనున్నది.


Similar News