ధాన్యం కొనుగోళ్లలో రికార్డ్.. గత సీజన్ కన్నా ఎంత అధికంగా సేకరించారంటే?

రికార్డు స్థాయిలో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నేటి వరకు కొనుగోలు చేశామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.

Update: 2023-05-30 15:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోనే ఏ రాష్ట్రం సాధించని విధంగా రికార్డు స్థాయిలో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నేటి వరకు కొనుగోలు చేశామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దాదాపు రూ.10,200 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని ఎనిమిది లక్షల మంది రైతుల నుంచి సేకరించామని, ఇందుకోసం రైతు చెంతకే వెళ్లి రికార్డ్ స్థాయిలో 7 వేల పైచిలుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

కొనుగోలు పూర్తయిన వెంటనే రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 1400 కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ పూర్తయి మూసివేశామన్నారు. గత సంవత్సరం ఇదే రోజు కన్నా 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా సేకరించామన్నారు. ఎఫ్‌సీఐ నిర్దేశించిన కనీస నాణ్యతా ప్రమాణాల ప్రకారం వచ్చిన ధాన్యంలో ఏ మిల్లర్ కోత పెట్టిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిపక్షాలు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులతో రాజకీయం చేయవద్దని హితవు పలికారు. విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా కొనుగోళ్లు జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..