ఐడీఎల్ చెరువు చుట్టూ రియల్ ఎస్టేట్ కంపెనీల పాగా
కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు చుట్టూ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు పాగావేశాయి. ప్రీలాంచ్ పేరుతో వ్యాపారాన్ని చేస్తున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు చుట్టూ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు పాగావేశాయి. ప్రీలాంచ్ పేరుతో వ్యాపారాన్ని చేస్తున్నాయి. మార్కెట్ కంటే ధర తక్కువంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. హైరైజ్డ్ బిల్డింగ్ ప్లాన్స్ చూపిస్తూ ఫ్లాట్లను అమ్మేస్తున్నాయి. అయితే ఆయా కంపెనీలు చూపిస్తున్న స్థలం ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత విస్తీర్ణంలో ఉన్నది? ప్రాజెక్టులకు అనుమతులు ఎవరిచ్చారు? అనే ప్రశ్నలకు మాత్రం వారి నుంచి సమాధానం కరువవుతున్నది. ఐడీఎల్ చెరువు కూడా ఆక్రమణకు గురైంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను కబ్జా చేసి భారీ ప్రాజెక్టులు నడుస్తున్నాయని రిమోట్ సెన్సింగ్ అథారిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇలాంటి తరుణంలో వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రీలాంచ్ పేరుతో..
ఓ రియల్ సంస్థ కూకట్‌పల్లిలో తాము నిర్మించే అపార్ట్‌మెంట్ ప్రాజెక్టును ప్రీ లాంచ్ అమ్మకాలను ప్రారంభించింది. అయితే వారు చూపిస్తున్న ల్యాండ్ కూకట్‌పల్లిలోని ఐడీఎల్ భూమి. ఆ ఐడీఎల్ భూములపై అనేక వివాదాలున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హిందూజ సంస్థ నుంచి ఐడీఎల్ భూములను ఫీనిక్స్ అనే సంస్థ అతి తక్కువ ధరకు కొనుగోలు చేసిందన్న ఆరోపణలున్నాయి. అయితే ఆ కంపెనీ పేరిటే ఇప్పటి వరకు మొత్తం రిజిస్ట్రేషన్ జరగలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు అందులో స్థలాన్ని చూపెట్టి మరికొన్ని నిర్మాణ సంస్థలు ఎలా ప్రాజెక్టులను చేపడుతామంటున్నాయో అర్థం కావడం లేదని రియల్ ఎస్టేట్ సెక్టార్ లో టాక్ నడుస్తున్నది.
అసలు ఆ ల్యాండ్ ఎవరిది?
ఐడీఎల్ భూములను ఓ సంస్థ కొనుగోలు చేసిందనే ప్రచారం నడుస్తున్నది. అయితే ఎంత విస్తీర్ణంలో కొనుగోలు చేసిందో తెలియని పరిస్థతి ఉంది. ఒకవేళ కొనుగోలు చేసినా ప్రాజెక్టులు చేపడుతున్నట్లు ఆ సంస్థే ప్రచారం చేసుకోవాలి. కానీ ఇతర కంపెనీలు తమ ప్రాజెక్టులు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఐడీఎల్ భూములను ఆ సంస్థ కొనుగోలు చేసి.. ఆ తర్వాత మిగతా కంపెనీలకు అమ్మేసిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అది నిజమైతే రెవెన్యూ రికార్డుల్లో ఐడీఎల్ కంపెనీ పేరిటే భూములు ఎందుకు ఉన్నాయి? కొనుగోలు చేసిన కంపెనీ పేరిట ఎందుకు మారలేదు? దాని నుంచి కొనుగోలు చేసిన కంపెనీలకు ఎందుకు రిజిస్ట్రేషన్ కాలేదు? ఇలాంటి అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజంగానే ఐడీఎల్ భూములను ఆ సంస్థ కొనుగోలు చేసిందా? లేదంటే కొంత మేరకు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ కుదుర్చుకుందా? ఆ సంస్థ కాకుండా ఐడీఎల్ భూములను కొన్న ఇతర రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయా? అసలు ఐడీఎల్ భూములు ఎవరైతే అమ్ముతున్నారో వారి పేరిటే ఇంకా పూర్తిగా రిజిస్ట్రేషన్ కాలేదనే వార్తలు హైదరాబాద్ రియల్టర్లలో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని కంపెనీలు ప్రీ లాంచ్ లో ఫ్లాట్లను విక్రయించే దందాను మొదలు పెట్టాయి. కూకట్ పల్లిలో ఫ్లాటు కావాలంటే చదరపు అడుగుకు 7 వేల నుంచి 10 వేల వరకు పలుకుతుంది. అలాంటిది నిబంధనలకు విరుద్ధంగా ప్రీలాంచ్ ఆఫర్ లో సగం ధరకే ఇస్తామంటుండడంతో కొందరు అమాయకులు మోసపోతున్నారని తెలిసింది. ఇప్పటికే కొన్ని సంస్థలు ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నామంటూ ఏడాదిన్నరగా ప్రచారం చేస్తున్నాయి. కానీ పనులు మాత్రం మొదలుపెట్టడం లేదు.
ఐడీఎల్ భూములు అమ్మేశారా?
ఐడీఎల్ భూములను ఐదు, పది, ఇరవై, నలభై ఎకరాల చొప్పున అమ్మేశారా? ఆ అమ్మిన సంస్థ ఏది? అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. ఇందులో స్థలాన్ని కొనేందుకు కొన్ని కంపెనీలు అడ్వాన్స్ ఇచ్చి.. మిగతా సొమ్మును కట్టేందుకు ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను అమ్మకానికి పెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. హైటైక్ సిటీకి దగ్గరలో హైరైజ్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అంటూ ఫ్లాట్ ధర రూ.4,499కే అని ప్రచారం చేస్తున్నారు. ఐతే వంద శాతం సొమ్ము ముందే చెల్లించాలనే షరతును విధిస్తున్నారు. ఫ్లాట్ల విస్తీర్ణం చూస్తే.. 1850, 2500 చదరపు అడుగులుగా నిర్ణయించారు. రెరా అనుమతి వచ్చిన నాటి నుంచి మూడున్నరేండ్లల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. చానెల్ పార్టనర్ల ద్వారా అమ్మకాలను సాగిస్తున్నారు. ఎక్కడా సదరు కంపెనీ పేర్లు రాకుండా దొడ్డిదారిని భాగస్వామ్య సంస్థలతో ప్రీలాంచ్ అమ్మకాలను నడిపిస్తున్నారు. అయితే అలాంటి సంస్థలకు ఇంత వరకూ హైరైజ్ బిల్డింగులు కట్టిన అనుభవంద కూడా లేదు. ఒక్క ప్రాజెక్టునూ కొనుగోలుదారులకు విజయవంతంగా అప్పగించని సంస్థలు కూడా ఐడీఎల్ భూములనే చూపిస్తున్నాయి. ఇలాంటి కంపెనీల వద్ద పెట్టుబడి పెట్టినా, ఆయా నిర్మాణాన్ని పూర్తి చేస్తుందనే గ్యారంటీ ఉండదు.
రేవంత్ దూకుడుకు మద్దతు
కొందరు రియల్టర్లు ఎలాంటి అనుమతులను తీసుకోకుండా వంద శాతం పేమెంట్ తో ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. అందులో కొన్నవారు మోసపోతున్నారు. సిటీ చుట్టూ కొన్ని ప్రాజెక్టులు అసలు మొదలే కాలేదు. అందులో కొందరు బిల్డర్లు కోర్టులు, రెరా చుట్టూ తిరుగుతున్నారు. అనుమతులు కూడా రాకపోవడంతో నిలిపేసిన ప్రాజెక్టులు కూడా అనేకం ఉన్నాయి. దీంతో డబ్బులు చెల్లించిన వారు బిల్డర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. దీంతో మోసాలు జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నది. ఇప్పటికే హైడ్రా అక్రమార్కుల భరతం పట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది. దానికి తోడు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అథారిటీ ద్వారా జల వనరుల కబ్జాలపైన రిపోర్టు తెప్పించుకున్నది. ప్రభుత్వ చర్యలు పదేండ్ల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో పేరుకుపోయిన చెత్తను ఎత్తేసే పనిలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.