రియల్ వ్యాపారి బరిదెగింపు..! కోర్టు వివాదంలో ఉన్న భూమిని..

వైరాలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి బరితెగించారు.

Update: 2023-05-02 01:53 GMT

దిశ, వైరా : వైరాలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి బరితెగించారు. కోర్టు వివాదంలో ఉన్న భూమిని డీటీసీపీ అనుమతి లేకుండానే వెంచర్ వేసి ప్లాట్లు విక్రయించారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పటికే సుమారు రూ.కోటిన్నరకు 25ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. నివురు గప్పిన నిప్పులా ఉన్న కోర్టు వివాదం గతంలో దిశ కథనాలతో బహిర్గతం కావడంతో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి రియల్ మోసం బహిర్గతమైంది. దీంతో ఆ వెంచర్లో 25ప్లాట్లు కొనుగోలు చేసిన మధ్యతరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు.

కోర్టు వివాదంలో ఉన్న భూమిని తమకు విక్రయించి అక్రమ రిజిస్ట్రేషన్ చేసి, లక్షలు వసూలు చేశారని ఒక్కో కొనుగోలుదారుడు ఆవేదన వెళ్లబుచ్చుతున్నారు. ప్రస్తుతం ఆ ప్లాట్లను విక్రయించే వీలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి ఒత్తిడి తట్టుకోలేక ఆ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఆ రియల్ చీటింగ్ వ్యాపారి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా గత నాలుగు నెలలుగా అధికారులు మాత్రం తమకేం తెలియదన్నట్లుగా నటిస్తున్నారు.

వైరాలోని ఓ రియల్ వ్యాపారి కొనుగోలుదారులను నమ్మించి మోసం చేశాడు. కోర్టు వివాదంలో ఉన్న భూమిని డీటీసీపీ అనుమతి లేకుండా వెంచర్ వేసి అందులో 25ప్లాట్లను అమాయకులకు అంటగట్టాడు. కోర్టు వివాదంలో ఉందని దిశ కథనాలతో బహిర్గతం కావడంతో వారు లబోదిబోమంటున్నారు. గత నాలుగు నెలలుగా వ్యాపారిపై కనీస చర్యలు తీసుకోకపోవడం అనుమానాలు వస్తున్నాయి. కొనుగోలు చేసిన వారి ఒత్తిడి పెరుగుతుండటంతో రిజిస్ట్రేషన్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

కోర్టు వివాద భూమి వివరాలు ఇవే...

కొణిజర్ల మండలంలోని దిద్దుపూడి రెవెన్యూ పరిధిలో న్యూ లిటిల్ ఫ్లవర్స్ పాఠశాల వెనుక భాగంలో సర్వే నెంబర్ 49లో గోరంట్ల నాగేశ్వరావు అనే వ్యక్తి పేరుపై మూడెకరాల స్థలం ఉంది. ఈ స్థలంపై నాగేశ్వరావు బంధువులు కోర్టులో కేసు వేశారు. దీంతో కోర్టు ఈ పొలం పై స్టే ఆర్డర్ విధించింది. కోర్టు వివాదంలో ఉన్న ఈ స్థలాన్ని వైరాకు చెందిన రియల్ వ్యాపారి 2021లో కొనుగోలు చేసి డీటీసీపీ అనుమతి లేకుండా వెంచర్ వేశాడు. ఈ వెంచర్‌లోని సుమారు 25ప్లాట్లను మధ్యతరగతి ప్రజలకు విక్రయించి, రిజిస్ట్రేషన్ చేశారు. అయితే కోర్టు వివాదంలో ఈ భూమి ఉన్న విషయం బహిర్గతం కావడంతో ప్లాట్లు కొన్న వాళ్లు తిరిగి అమ్మేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో ఆ ప్లాట్లు కొన్న మధ్య తరగతి ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

కనీస చర్యలు శూన్యం..

కోర్టు వివాదంలోని భూమిలో ప్లాట్లను కొనుగోలు చేసిన వారి పేరిట గతంలో రియల్ వ్యాపారి చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అధికారులు హోల్డ్‌లో పెట్టారు. ప్రస్తుతం ఆహోల్డ్‌ను తీసివేయించేందుకు రియల్ వ్యాపారి శతవిధాల ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మూడు నెలల క్రితం మున్సిపాలిటీ అధికారులు ఈ అక్రమ వెంచర్‌లోని రాళ్లను తొలగించారు.

అధికారులు తొలగించిన మరునాడే సదరు రియల్ వ్యాపారి మరలా ప్లాట్ల సరిహద్దు తెలుపుతూ రాళ్లను ఏర్పాటు చేశాడు. ఈ రాళ్లని ఏర్పాటు చేయించడంలో స్థానికంగా కొంతమంది ప్రజాప్రతినిధుల హస్తం ఉందని వైరాలో బహిరంగ ప్రచారమే జరుగుతున్నది. అయితే నేటికీ ఆ రాళ్లను తొలగించకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారి నివేదిక..

దిశ దినపత్రికలో వచ్చిన అనేక వార్త కథనాలతో నాలుగు నెలల క్రితం వైరాలో అప్పుడు పని చేసిన ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్తా ఈవెంచర్ అక్రమాలపై విచారణ నిర్వహించి, నివేదికను ఉన్నతాధికారులు సమర్పించారు. కోర్టు వివాదంలో ఉన్న భూమిని డీటీసీపీ అనుమతి లేకుండా మున్సిపాలిటీలో వెంచర్‌గా మార్చారని అప్పట్లో ఆమె కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు.

అప్పట్లో హడావుడిగా ఫ్లాట్ల సరిహద్దు రాళ్లను తొలగించారు. అయితే వెంటనే అధికారులకు సవాల్ చేస్తూ మళ్లీ రాళ్లను రియల్ వ్యాపారి పాతాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు సదరు రియల్ వ్యాపారిపై అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడంతో ట్రైనీ కలెక్టర్ నివేదిక బుట్ట దాఖలైందని స్థానికంగా విమర్శలు వినవస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రియల్ మోసానికి పాల్పడిన వ్యాపారిపై చర్యలు తీసుకుంటారో.. లేదో.. వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News