కాంగ్రెస్ అంటేనే ఆకాశమంత సమానత్వం: భట్టికి అవమానం ఆరోపణలపై కాంగ్రెస్ శ్రేణుల స్పందన
యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల తొలి పూజ కార్యక్రమం సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల తొలి పూజ కార్యక్రమం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ పార్టీతో సహా పలువురు నెటిజన్లు భట్టికి జరిగిన దానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బ్రహ్మోత్సవాల తొలిపూజ లో సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ పూజ సమయంలో సీఎం దంపతులు, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద పీటలపై కూర్చున్నారు. డిప్యూటీ సీఎం భట్టికి మాత్రం చిన్న పీట వేసి పక్కన కూర్చోబెట్టారు. దీంతో ఈ వ్యవహారం వైరల్ అయ్యింది. దళిత సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎంకు దేవుడి సాక్షిగా అవమానం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్పందించాయి.
కాంగ్రెస్ పార్టీ బ్లడ్‌లోనే సమానత్వం ఉందని, కాంగ్రెస్ అంటేనే ఆకాశమంత సమానత్వం అని పార్టీ శ్రేణులు ట్వీట్‌లు చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర సమయంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క కలిసి టిఫిన్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా శ్రేణులు చేసిన ట్వీట్‌లను రీట్వీట్‌లు చేసింది. దీనిపై నెటిజన్లు మరోసారి తిరిగి కౌంటర్ ఇస్తున్నారు. ఆకాశమంత సమానత్వం కానీ భూమి మీద అవమానం జరిగిందని కామెంట్ చేస్తున్నారు. డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి సోషల్ మీడియాలో ఈ పోస్టులు చేస్తున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.