పైసలిస్తే దీవెనలు.. ఇయ్యకుంటే శాపాలు..

పసిపిల్లలతో భిక్షాటన చేస్తే కఠిన చర్యలు తప్పవు అన్న అధికారుల మాటలు నీటి మీద రాతలుగా మారాయని పలువురు విమర్శిస్తున్నారు.

Update: 2024-11-13 13:57 GMT

దిశ, కొత్తూరు : పసిపిల్లలతో భిక్షాటన చేస్తే కఠిన చర్యలు తప్పవు అన్న అధికారుల మాటలు నీటి మీద రాతలుగా మారాయని పలువురు విమర్శిస్తున్నారు. ఎందుకంటే నెలల వయసు గల పసి పిల్లలతో భిక్షాటన చేస్తూ పలువురు మహిళలు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళు అడగగానే డబ్బులు ఇస్తే ఒకలా.. డబ్బులు ఇవ్వకుంటే ఇంకొకల మాటలంటూ జబర్దస్తీ చేస్తుండడంతో ఇలాంటి వారి పై చర్యలు తీసుకునే వారే లేరా అని ప్రశ్నిస్తున్నారు. పసిపిల్లలను బలవంతంగా ఏడిపిస్తూ బిక్షమెత్తుకునే ఈ విష సంస్కృతి ఒకప్పుడు హైదరాబాదులో కనిపించేది. ప్రస్తుతం మండల కేంద్రంలో వై జంక్షన్ కు అతి సమీపంలో ఉన్న పలు హోటల్స్ వద్ద పసి పిల్లలను చంకనేసుకుని భోజనం కోసం వాహనాలు ఆపిన వారి దగ్గర బిక్షమెత్తుకుంటున్న మహిళలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. నెలల వయసు ఉన్న పిల్లలను చంకనేసుకుని పిల్లలను బలవంతంగా ఏడిపిస్తూ బిక్షాటన కొనసాగిస్తున్నారు. ఇంకా కొందరు మహిళలు పిల్లలకు బిక్షాటన నేర్పిస్తున్నారని అక్కడి హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికైనా బాలల సంరక్షణ యూనిట్‌ అధికారులు స్పందించి పిల్లలను రక్షించాలని పలువురు కోరుతున్నారు.

మండల కేంద్రంలో బెగ్గింగ్ మాఫియా..?

రూపాయి పెట్టుబడి లేకుండానే రూ.లక్షల్లో సంపాదన వచ్చే మార్గాల్లో బెగ్గింగ్ మాఫియా కూడా ఒకటి. కొంతమంది తమ స్వార్థం కోసం ముసలి వాళ్లను, పిల్లలను, ఆడవాళ్లు చేతికి పసి పిల్లలను ఇచ్చి బిక్షం ఎత్తుకునేలా చేస్తుంటారు. వారిని రోడ్ల పై అడుక్కునేలా చేసి ఆ డబ్బుతో లక్షల రూపాయలు గడిస్తుంటారు. అటువంటి బెగ్గింగ్ మాఫియా కొత్తూరు మండల కేంద్రంలో భిక్షాటన దందా మొదలు పెట్టిందేమో అనే అనుమానలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పదుల సంఖ్యలో మహిళలు వృద్ధులు కొత్తూరు మండల కేంద్రంలో లో బిక్షమెత్తుతు కనిపిస్తున్నారు.

బాల రక్షక్‌ వాహనాల గురుంచి మీకు తెలుసా...

ఆపదలో ఉన్న బాలల రక్షణ కోసం గత ప్రభుత్వం 2022లో 1098 హెల్ప్‌ లైన్‌ను ఏర్పాటు చేసి, జిల్లాకు ఒకటి చొప్పున సీఎస్‌ఆర్‌ నిధులతో బాల రక్షక్‌ వాహనాలను కేటాయించింది. అనాథ బాలలు, 18 ఏండ్ల లోపు పిల్లలు భిక్షాటన చేసినా, బాల్య వివాహం జరుగుతున్నా 1098 హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేయాలని తెలిపింది. హెల్ప్‌ లైన్‌కు కాల్‌ వచ్చిన వెంటనే ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, జిల్లా బాలల సంరక్షణ యూనిట్‌ అధికారులు కలిసి బాల రక్షక్‌ వాహనంతో సంఘటనా స్థలానికి చేరుకొని వారిని రక్షిస్తారు. బాల సదనంకు చేర్చి వారికి వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. అలాగే పరిస్థితులను బట్టి పోలీసు, రెవెన్యూ తదితర సంబంధిత శాఖల అధికారుల సహకారం కూడా తీసుకుంటారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో బాల రక్షక్‌ వాహనాలు నిర్వహిస్తారు.

Tags:    

Similar News