మా పొట్ట కొడతారా..? మరోచోట భూములు ఇచ్చాకే పనులు చేయండి
మా తాతలకు సాగు చేసుకునేందుకు ఇచ్చిన భూములను తిరిగి లాక్కోవడం ఏంటంటే గిరిజన రైతులు ఆందోళనకు దిగారు.
దిశ, పరిగి : మా తాతలకు సాగు చేసుకునేందుకు ఇచ్చిన భూములను తిరిగి లాక్కోవడం ఏంటంటే గిరిజన రైతులు ఆందోళనకు దిగారు. పరిగి మండలం రంగాపూర్ గ్రామ సర్వే నెంబర్ 50 లో లావుడ్యా రాజు, శివ, రవి, రూప్లీ బాయి, అచాని రైతులకు ఆరెకరాల అసైన్డ్ పొలాల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు ఒక ఎకరా, మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలకు 5 ఎకరాల పొలం కేటాయించారు. మూడు రోజుల క్రితం తమ పొలాల్లో బోర్డులు పాతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సంబంధించి ప్రహరీ గోడ బేస్మెంట్ జెసిబి తో తవ్వించారు. మా భూముల్లో బోర్డులు పాతడమే కాకుండా, మాకు కనీస సమాచారం ఇవ్వకుండా జెసిబి తో ఎలా పనులు చేస్తారంటూ అడ్డగించారు. మా జీవనాధారమైన అసైన్డ్ భూములు లాక్కునప్పుడు, మాకు మరోచోట భూములు ఇచ్చాకే మీరు పనులు చేయాలంటూ జెసిబి కి అడ్డంగా రైతులు కూర్చున్నారు.
దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ప్రభుత్వం ఈ భూములను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలకు కేటాయించిందని తెలిపారు. మాకు మరోచోట భూములు ఇచ్చేంతవరకు పనులు సాగనివ్వమంటూ మొండికేశారు. ఎస్ ఐ సంతోష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని అభివృద్ధి పనులు అడ్డు కోవద్దంటూ తెలిపారు. స్థానిక తహసిల్దార్ కు తమ గోడు వినిపించుకోవాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మీ భూములు సర్వే చేయించాకే పనులు జరిగేలా చేస్తామంటూ తహసీల్దార్ ఆనందరావు తెలిపారన్నారు. మళ్లీ గుట్టు చప్పుడు కాకుండా పనులు ప్రారంభించడం ఏంటంటూ ఎస్ఐని ప్రశ్నించారు. మీకు మరో చోట భూములు ఇప్పించేలా అధికారులతో మాట్లాడుతానని రైతులను ఎస్ఐ సముదాయించారు. దీంతో గిరిజన రైతులు శాంతించారు.