అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన భర్త

అతిగా మద్యం సేవించి భార్యను చితకబాది ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన భర్త అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాలాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-12-28 15:48 GMT

దిశ, బడంగ్​ పేట్​ : అతిగా మద్యం సేవించి భార్యను చితకబాది ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన భర్త అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాలాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలాపూర్​ ఇన్​స్పెక్టర్​ సుధాకర్​ తెలిపిన వివరాల ప్రకారం.... వాదియే సాలేంకు చెందిన హజిరా ఫాతిమా, మొహమ్మద్​ వాసిమ్​ (30) వీరికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పెళ్ళైన నాటి నుంచి మొమహ్మద్​ వాసిమ్​ చిత్తుగా మద్యం సేవించి భార్యతో తరచు గొడవకు దిగేవాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం కూడా చిత్తుగా మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు

భార్యను కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. దీంతో భార్య పుట్టింటికి వెళ్ళింది. అత్తగారింటికి శుక్రవారం వెళ్ళిన మొహమ్మద్​ వాసిమ్​ అక్కడ కూడా మరోమారు భార్యపై చేయిచేసుకున్నాడు. నీకు విడాకులిస్తానని భార్యను బెదిరించి ఇంటికి వచ్చాడు. నిన్న రాత్రి కూడా మద్యం సేవించి ఇంట్లోకి వెళ్ళాడు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులు చూసే సరికి ఇంట్లో మొహమ్మద్​ వాసిమ్​ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కనిపించింది. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులు బాలాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వాసిమ్​ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ కేసును బాలాపూర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News