రైతులకు అండగా ఉంటాం
రైతులకు అండగా ఉంటామని, కబ్జాదారులపై ఉక్కుపాదం మోపేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రాను తీసుకువచ్చారని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
దిశ, బడంగ్ పేట్ : రైతులకు అండగా ఉంటామని, కబ్జాదారులపై ఉక్కుపాదం మోపేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రాను తీసుకువచ్చారని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కబ్జాలకు పాల్పడిన ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చెరువులు, పార్కులు ఎక్కడెక్కడ కబ్జాలు అయ్యాయో రిపోర్టు తయారు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూర్ వైఏఆర్ గార్డెన్లో ఆయన బడంగ్ పేట్, మీర్ పేట్ కార్పొరేషన్లకు చెందిన రైతులతో సమావేశమయ్యారు. దీంతో బాధితులు భూసమస్యలపై మంత్రికి ఏకరువు పెట్టారు. ఇందిరమ్మ హయాంలో ఇచ్చిన భూములను బీఆర్ఎస్ పాలనలో లాక్కున్నారని భూ బాధితులు మంత్రి శ్రీధర్ బాబు, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి కేఎల్ఆర్ ల దృష్టికి తీసుకువచ్చారు.
అలాగే కాసువాగు భూములకు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని నాదర్ గుల్ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా సాగు చేసిన భూములను లాక్కొని ప్రభుత్వ బిల్డింగ్స్, లేఅవుట్ వేస్తూ తమ కుటుంబాలను రోడ్డు పాలు చేశారని బడంగ్ పేట, కుర్మల్ గూడ, గుర్రంగూడ దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థలాల పట్టాలు ఇచ్చి పోజిషన్ చూపించకుండా సర్టిఫికెట్లతో సరిపెడుతున్నారని లబ్ధిదారులు మంత్రి శ్రీధర్ బాబు, లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి వై.అమరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, పుట్టగళ్ల జగన్, బొక్క జంగారెడ్డి, బోయపల్లి గోవర్దన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గుడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.