అంచమడుగు వాగులో అక్రమ వెంచర్లు..
అంచమడుగు వాగులో వెంచర్ పనులు నిలిపివేయాలని శంషాబాద్ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, సుల్తాన్ పల్లి సర్పంచ్ దండు ఇస్తారి అన్నారు.
దిశ, శంషాబాద్ : అంచమడుగు వాగులో వెంచర్ పనులు నిలిపివేయాలని శంషాబాద్ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, సుల్తాన్ పల్లి సర్పంచ్ దండు ఇస్తారి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సుల్తాన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కేబీ దొడ్డి పక్కన ఉన్న అంచమడుగు వాగుని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పూడ్చివేశారు. అనంతరం ఆ స్థలంలో వెంచర్ చేస్తున్నారని దాన్ని నిలిపివేయాలని కోరుతూ బుధవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు సుల్తాన్ పల్లి సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు ఈసీ వాగుకు అనుబంధ వాగుగా అంచమడుగు వాగు ఉంది. భారీ వర్షాలు వచ్చినప్పుడు వరదంతా పెద్ద ఎత్తున అంచమడుగు వాగు గుండా వెళ్లిపోతుందన్నారు. అయినా ఎన్నోసార్లు వరద వచ్చి పక్కనే ఉన్న కేబి దొడ్డి గ్రామం నీట మునిగిన ఘటనలూ ఉన్నాయన్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ అంచమడుగు వాగులో వెంచర్ పనులు ప్రారంభిస్తే భారీ వర్షాల సమయంలో కేబిదొడ్డి గ్రామం పూర్తిగా నీటమునిగి గ్రామప్రజలంతా వరదలలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు.
దానిని దృష్టిలో ఉంచుకొని అంచమడుగు పూడ్చివేసిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకొని, వెంచర్ పనులు నిలిపివేయాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సానుకూలంగా స్పందించి వెంచర్ పనులు నిలిపివేసి, వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చందు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.