రెండు సంవత్సరాలకే నిర్మాణాల్లో పగుళ్లు.. పనులన్నీ నాసిరకమే
అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ స్వార్థం మూలంగా
దిశ, శంకర్ పల్లి : అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ స్వార్థం మూలంగా పనులు నాసిరకంగా చేపట్టడంతో నిర్మించిన కొన్నాళ్లకే పగుళ్లు కనిపిస్తున్న సంఘటన లు కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు నాసిరకంగా చేపట్టడంతో రెండు సంవత్సరాలకి పగుళ్లు దర్శనమిస్తున్నాయి. మండలంలోని దొంతాన్ పల్లి గ్రామ పంచాయతీ భవనం రెండు సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ భవనాన్ని అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. భవనం నిర్మించి రెండు సంవత్సరాలు గడవకముందే పగుళ్లు ఏర్పడి దర్శనమిస్తున్నాయి.
భవన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెట్లు పగుళ్లు ఏర్పడటం తో పాటు కార్యాలయ భవనానికి వెళ్లే ద్వారం కడప కింద రంధ్రం సైతం ఏర్పడి తలుపు ఎప్పుడు విరిగిపోతుందోననే ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం అభివృద్ధి పనుల నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం క్వాలిటీ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణ అసలే లేకపోవడంతో పనులు నాసిరకంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నాసిరకంగా పనులు జరుగుతున్న నిర్మాణాలపై విజిలెన్స్ అధికారులతో తనిఖీలు చేస్తే వాస్తవాలు బయటపడతాయని ఆయా గ్రామాల ప్రజలు సూచిస్తున్నారు.