ధరణిని ఆదాయ వనరుగా మార్చారు..
ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చి రెండేండ్లయినా రాష్ట్రంలో భూ సమస్యలు 9 లక్షల 24 వేల సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి వేలాది మంది రైతులు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారని, కానీ నేటి వరకు పరిష్కరించలేదని భూ చట్టాల న్యాయ నిపుణులు, నల్సార్ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు భూమి సునీల్ అన్నారు.
దిశ, యాచారం : ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చి రెండేండ్లయినా రాష్ట్రంలో భూ సమస్యలు 9 లక్షల 24 వేల సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి వేలాది మంది రైతులు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారని, కానీ నేటి వరకు పరిష్కరించలేదని భూ చట్టాల న్యాయ నిపుణులు, నల్సార్ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు భూమి సునీల్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఉచిత భూ న్యాయ శిబిరాన్ని లీగల్ ఎంపవర్ మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ (లీఫ్స్), గ్రామీణ న్యాయ పీఠం, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం సంస్థల సంయుక్త నిర్వహణలో మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ముదిరెడ్డి కోదండ రెడ్డి ఆధ్వర్యంలో భూ న్యాయ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ తహశీల్దార్ల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఆర్డీవో వి.లచ్చిరెడ్డి, భూ చట్టాల న్యాయ నిపుణులు, నల్సార్ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు భూమి సునీల్, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ దేశాయి కేతిరెడ్డి వారు మాట్లాడుతూ గ్రామాల్లో వందలాది కుటుంబాలు భూ హక్కుల చిక్కుల్లో చిక్కుకున్నాయన్నారు. సమస్య ఏమిటి, పరిష్కారం ఎలానో తెలియని గందరగోళంలో ఉన్నారన్నారు. ఈ శిబిరం ద్వారా భూ సమస్యలు ఉన్న రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందిస్తున్నామన్నారు. భూమి విషయంలో గ్రామాల్లో కమిటీలు వేసి సమస్యలు పరిష్కారం చేస్తే రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ తొందరగా పరిష్కరించవచ్చన్నారు.
అసెంబ్లీ సాక్షిగా ధరణి పోర్టల్ లో సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. కానీ నేటికీ దాని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని విమర్శించారు. భూమి విషయంలో చిన్న సమస్యలు ఏర్పడ్డ ఒకప్పుడు గ్రామంలో, మండలంలో పరిష్కారమయ్యేటివని, కానీ నేడు మండలం దాటి జిల్లాకు చేరుకున్నాయని అన్నారు. ప్రభుత్వం పాత ఆర్ఓఆర్ చట్టాన్ని రద్దుచేసి కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. నేడు 124 భూమి చట్టాలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గ్రామాలలో ప్రతి గ్రామానికి 200 భూ సమస్యలు ఉన్నాయన్నారు. అందులో పాత సమస్యలు కొన్ని, ధరణి వచ్చాక మరి కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 1000 కోట్ల బడ్జెట్ తో రాష్ట్రంలోని భూములను సర్వే చేసిందన్నారు. తెలంగాణలోని భూములు ఇంకా సర్వే చేయకపోవడం విడ్డూరమని సర్వే చేస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. ధరణి అద్భుతాలు అని చెప్పిదరిద్రాలు సృష్టించిందన్నారు. సాదా బైనమ పేరుతో మీసేవ సెంటర్ నిర్వాహకులు దోపిడి చేస్తున్నారని అన్నారు. ధరణి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ధరణి పోర్టల్ ను రద్దు చేయకుండా భూ సమస్యలు పరిష్కారం అవ్వాలంటే రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో ఒక రెవెన్యూ కమిటీ నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొగుడంపల్లి ఆశప్ప, జేఏసీ రాష్ట్ర నాయకులు గంగాపురం వెంకట్ రెడ్డి, టీపీసీసీ సభ్యుడు మర్రి నిరంజన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, దండం రాంరెడ్డి, వివిధ పార్టీల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
లోను కట్టమని ఇబ్బంది పెడుతున్నారు.. బుక్క చెన్నయ్య , నానక్ నగర్ గ్రామస్థుడు
మేడిపల్లి నక్కర్త గ్రామంలో 255, 256 సర్వే నెమ్బర్లలో 1 ఎకరా 20 గుంటల భూమి ఉంది. 2 ఏండ్ల కింద బ్యాంక్ లో రూ. లక్ష క్రాప్ లోన్ తీసుకున్నాం. ఇప్పుడు బ్యాంక్ సిబ్బందిలోను రెన్యూవల్ చేయాలి అంటున్నారు. రెన్యూవల్ చేయాలంటే ఆన్లైన్ పహాణి అడుగుతున్నారు. ధరణిలో నా పేరు లేకుండా టీఎస్ఐఐసీ పేరు చూపిస్తుంది. పహాణి నా పేరు మీద రావడం లేదు.
ఆర్డీవో చుట్టూ తిరిగిన ఫలితం లేదు.. జోగు సత్తయ్య, నానక్ నగర్ గ్రామస్థుడు
నాకున్న 2 ఎకరాల 13 గుంటల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు. కూర్మిద్ద నుంచి తుర్కయాంజాల్ వరకు పాదయాత్ర చేసి ఆర్డీవోని కలిసి నా సమస్య చెప్పిన అడిగిన 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తా అన్నాడు. ఐన ఫలితం లేదు. రైతు బంధు వస్తలేదు.