యువత వాటికి దూరంగా ఉండాలి : తలకొండపల్లి ఎస్సై వెంకటేష్
ఆన్లైన్ గేమ్స, మాదక ద్రవ్యాలు, క్రికెట్ బెట్టింగ్ కు యువత దూరంగా ఉండాలని తలకొండపల్లి ఎస్సై బి. వెంకటేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో రోజుకొక రకమైన క్రికెట్ బెట్టింగ్స్ యాప్లు అందుబాటులోకి వస్తున్నాయన్నారు.
దిశ, తలకొండపల్లి : ఆన్లైన్ గేమ్స, మాదక ద్రవ్యాలు, క్రికెట్ బెట్టింగ్ కు యువత దూరంగా ఉండాలని తలకొండపల్లి ఎస్సై బి. వెంకటేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో రోజుకొక రకమైన క్రికెట్ బెట్టింగ్స్ యాప్లు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఆఫర్స్, బెట్టింగ్ ఫ్రీ అంటూ యువత ఆకర్షించి వారి జీవితాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. ఒకసారి ఆడిచూద్దాం అని సరదాగా మొదలుపెట్టి వీటి బారిన పడిన యువకులు బయటకు రావడం అనేది కష్టతరమైన విషయమని అన్నారు. ఈ బెట్టింగ్ కు అలవాటు పడ్డవాళ్ళు అప్పుల పాలు కావడమే కాకుండా.. చేసిన అప్పులు తీర్చలేక చివరికి ఆత్మహత్యలు పాల్పడుతున్నారని తెలిపారు.
క్రికెట్ ఆటను అభిమానించేవారు ఎక్కువ సంఖ్యల్లో ఉంటారని వారికి ఈ నెల 31నుంచి మొదలు కాబోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఎంతో ఇష్టమైనదని అన్నారు. ప్రజల్లో క్రికెట్ కు ఉన్న మక్కువను ఆసరాగా తీసుకొని క్రికెట్ బెట్టింగ్ ముఠాలు ఎలాగైనా క్యాష్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాయన్నారు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని ఆశ పడొద్దన్నారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఎంతో మంది జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. క్రికెట్ ఐపీఎల్ బెట్టింగ్ లు పెట్టడం, చట్ట విరుద్ధమైన ఆటలు ఆడడం నేరం అని, అలాంటి వారిని ప్రోత్సహించిన వారు సైతం చట్టపరమైన శిక్ష అనుభవించక తప్పదు అన్నారు. యువత చెడు మార్గంలో వెళ్లకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు యువజన సంఘాలపై ఎంతో బాధ్యత ఉందని ఎస్సై వెంకటేష్ పేర్కొన్నారు.